కవితావర్షం :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గుండెలోన 
కురిసింది అక్షరవర్షము 
హృదిని
తడిపింది పదాలజల్లు

తలలోన
ప్రవహించాయి ఊహలు
మనసులోన 
ఏర్పడింది భావము

ఉల్లం ఉప్పొంగి
పుట్టింది విషయము
చిత్తం స్పందించి
ఇచ్చింది చైతన్యము

కాగితంపై
అక్షరాలుచల్లింది కలము
పదాలై
పుట్టకొచ్చింది కవిత

అందమై
ఆకట్టుకుంది కవనము
ఆనందమై
అలరించింది కవిత్వము

కమ్మదనమై
ఉదయిస్తుంది కవిత
తీయదనమై
తేనెచల్లుతున్నాడు కవి 

నిత్యమై
కురుస్తుంది కవితావర్షము
సత్యమై 
నిలుస్తుంది సాహితీలోకము 


కామెంట్‌లు