సుప్రభాత కవిత : - బృంద
తరువులో తొలి చివురులా
తోటలో కోయిల పిలుపులా 
మావి పులుపున కలిసిన 
వేప చిరు చేదులా...

ముగ్గుల ముంగిలితో
తోరణాల ద్వారాలతో
అగరు పొగల మధ్య
హారతి వెలుగులలో.....

వేంచేసిన నవ వత్సరానికి 
వేడుక నిండిన సంబరాలతో 
వేయి ఆశల పూర్ణకుంభముతో 
వేద మంత్రాలతో స్వాగతం.

పండుగలా ప్రతిరోజూ 
పసిపిల్లల్లా ఆనందం పొందుతూ
ప్రతి అన్నది లేక  గెలుపొంది
పదుగురి మంచి కోరుతూ..

పరుల చిరునవ్వుకు
మనం కారణమవుతూ..
వేరొకరి వేదనకు
మనం ఓదార్పు అవుతూ..

కాసులు అవసరమే లేని
కరుణ కలిగివుండి
కలతల నలిగే వారి
కన్నీరు తుడుస్తూ..

అందరినీ కాకపోయినా
కొంతమందినైనా అభిమానిద్దాం
అవసరం కోసం కాక
అచ్చంగా ప్రేమను పంచుతూ...

మనవల్ల కన్నీరు కాక
మనకోసం కంట నీరు నింపేలా
మమతలు పంచి
మనుగడకు ఒక అర్థాన్నిద్దాం.

అందరిలో ఒకరవుదాం 
అందరికీ మనమవుదాం
లోకం వదిలినా జ్ఞాపకంగా 
మనసుల్లో మిగులుదాం...

కొత్తగా తోచే ఉదయానికి
శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు