న్యాయాలు-791
"అర్థాతురో న గణయ త్యపకర్ష దోషమ్ " న్యాయము
******
అర్థాతురో అనగా ధనము మీద ఆశ గల . న అనగా కాదు/ లేదు.గణయ అనగా లెక్కించు త్యపకర్ష/ అపకర్ష అనగా తీసివేయడం, దాని స్థలం నుండి బయటకు లాగడం లేదా బలవంతంగా స్థాన భ్రంశం చేయడం. దోషమ్ అనగా తప్పు లేదా వ్యాధి.
ధనము మీద ఆశ గలవాడు నీచత్వం కలిగి అవమానమును ఏదీ గణన లేదా లెక్క చేయడు.ఇలాంటి వ్యక్తికి ధనంపై అతిగా ఆసక్తి కలిగి, వాటిని పొందడానికి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు అని అర్థము.
ధనం మీద ఆశ పెరిగే కొద్దీ బంధాలు- అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి అంటే వాటన్నింటి కంటే ధనమే ప్రధానం అనిపిస్తుంది. అందుకే అలాంటి వారికి చెంపపెట్టులా వేమన ఓ అద్భుతమైన పద్యం రాశారు. అదేమిటో చూద్దాం.
"బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు/ ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ/ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా ప్రస్తుతం మనది అనుకునేది ఏదీ మనది కాదు.అంటే ఎప్పటికీ మనతో ఉండేది కాదు అంటాడు వేమన.బొంది అంటే దేహం.దీనికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం,చివరికి మరణం అనే పరిణామముంది. మన ఎంత పోషణ చేసినా అది తాత్కాలికమే.ఎప్పుడూ ఒకేలా ఉండదు.మార్పు చెందుతుంది. అలాగే ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది ఎప్పటికైనా తిరిగి ఆత్మ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు ఎలా ఈ దేహాన్ని జీవశక్తి వీడిపోతుందో అంటే ప్రాణం పోతుందో తెలియదు.
ఇక భక్తి ఒక్కటే ఉంటే చాలు అనుకుంటాం కానీ అదొక్కటే చాలదు. ఎందుకంటే భక్తిలో మూఢ భక్తి, జ్ఞాన భక్తి ఉన్నాయి. కావలసింది జ్ఞానయోగంతో కూడిన భక్తి కావాలి. ఇప్పుడు మనం ఆచరిస్తున్నవి ఏవీ శాశ్వతం కావు.ఇక మనం సంపాదించే ధనము కూడా అంతే. స్వార్జితమా? సరైన మార్గంలో వచ్చిందా? అది మన చేతుల్లో ఎంతో కాలము ఉండదు.కానీ న్యాయముతో కూడిన ధర్మము ఒక్కటే మిగిలి వుంటుంది.మనం లేక పోయినా వుండేది ధర్మమే.అది తెలుసుకోవాలి. ధనము మీద ఎప్పుడైతే అత్యాశ పెరుగుతుందో ఇవన్నీ చెవికి, మనసుకు ఎక్కవు. ధనం కలకాలం నిలిచి ఉంటుంది అనుకోవడంలోనే అజ్ఞానం ఇమిడి ఉంది. అది తొలగించుకొని ధనాన్ని సక్రమమైన మార్గంలో దాన ధర్మాలకు ఉపయోగించడం లోనే జ్ఞాన సంబంధమైన వివేకం ఉందని వేమన అంటాడు.
ఈ ధనం పట్ల విపరీతమైన మోహం పెంచుకుని మానవతను మరిచి, అకృత్యాలకు, అన్యాయాలకు పాల్పడే వారిని ఉద్దేశించి సుమతీ శతక కర్త ఇలా అంటాడు.
"సిరి తా వచ్చిన వచ్చును / సలలితముగ నారికేళ సలిలము భంగిన్/ సిరి దా బోయిన బోవును/ కరి మింగిన వెలగపండు కరణిన్ సుమతీ!"
అనగా కొబ్బరి కాయలోకి నీళ్ళు ఎలా వచ్చి చేరుతాయో అంతుపట్టదు.అలాగే రావాల్సిన సమయంలో సంపదలు వాటంతట వచ్చే వస్తాయి.ఇక ఐశ్వర్యం కూడా అంతే. వెళ్ళాల్సిన సమయం వస్తే మన చేతుల్లో ఏముండదు. ఏనుగు తినే వెలగపండు జీర్ణమైన తర్వాత కూడా పండు ఆకారంలోనే ఉంటుంది కానీ లోపల గుజ్జు ఉండదు.అలా సిరి/ సంపద వెళ్ళి పోతుంది.కనుక ధనము మీద అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోకూడదు అని హితవు చెబుతున్నారు.
అందుకే ధనము మీద ఆశ వదులుకోవాలి.ఈ ధనముతో సహవాసం అతిగా చేస్తే చివరకు మిగిలేది అశాంతే.
ధనము మీద అతి ఆశ ఉన్న వారికి న్యాయము, ధర్మము, నీతి నియమాలు ఏవీ ఉండవు అనే అర్థంతో ఈ "అర్థాతురో న గణయ త్యపకర్ష దోషమ్" న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
కనుక ఇకనైనా ఇన్ని ఉదాహరణలు, విషయాలు తెలుకున్నాక అయినా అశాశ్వతమైన ఈ జీవితంలో అతిగా ధనసంపాదనపై దృష్టి పెట్టడం మానేయాలి అంటారు.
మరి మనం ధనమా? ధర్మమా? దేనికి ఓటేద్దాం? దేనినీ అనసరిద్దాం? మనమే నిర్ణయించుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి