ఆడ పిల్ల: - డా. రావి రంగారావు, గుంటూరు.
ఆడ పిల్ల అనగానే 
అమ్మ గుర్తు రావాలి!
అమ్మ గుర్తు రాగానే
ఆది శక్తి మెరవాలి!

కని పెంచిన ఇంటిని
కాలదన్ని వస్తుంది!
అడుగుపెట్టి మరో ఇల్లు
గుడిగా భావిస్తుంది! 

ఇల్లు వదలటంతో పాటు
ఇంటి పేరు వీడుతుంది!
కట్టుకున్న ఇంటి పేరు
కమ్మనిదని మురుస్తుంది!

ఇంటి ఆకలిని తీర్చే 
వంటవుతుం దమ్మాయి!
ఇంటి గౌరవం నిలిపే 
పంటవుతుం దమ్మాయి!

అమ్మాయో అబ్బాయో 
ఆలోచన లేకుండా 
కడుపులోన  మోస్తుంది! 
కడదాకా భరిస్తుంది! 

అమ్మాయి పదంలోన 
అమ్మ పూర్తిగా ఉంది!
అమ్మ కాస్త ఎదిగి మరీ 
అమ్మాయిగ పుడుతుంది!

అవని మీద రాక్షసులూ 
అహంకారమై పుడితే
ఆదిశక్తి అమ్మాయిల
అవతారా లెత్తుతుంది! 

అమ్మాయే అమ్మయాక 
కోప మనేదే ఎరుగదు! 
నాన్న తిట్టి నపు డమ్మకు 
అన్నం తినటం తెలియదు!

కోడలిలో అత్త మామ
కూతురునే చూడాలి! 
అత్త మామలో ఆమెకు 
అమ్మ నాన్న కనబడాలి!

ఆడ పిల్ల అనగానే 
అమ్మ గుర్తు రావాలి!
అమ్మ గుర్తు రాగానే
ఆది శక్తి మెరవాలి!


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Thanks