ఆమె మళ్ళీ మళ్ళీ పుట్టింది!!: - డా ప్రతాప్ కౌటిళ్యా
నది పుట్టినట్లు సముద్రం పుట్టినట్లు 
మేఘం పుట్టినట్లు 
ఆమె ఈ లోకంలో మళ్లీ మళ్లీ పుట్టింది!!

మెత్తని నీటిని తాకీతే 
మహాసముద్రం ప్రత్యక్షమైనట్లు 
పచ్చని చిగురు తొడిగితే 
మహావృక్షం సాక్ష్యం చెప్పినట్లు 

చెత్తలో పడినా-విత్తనం 
కొత్తగా ప్రపంచానికి పరిచయమైనట్లు 
శిథిలమైన కోటల్లో 
తోటల్లోని పూలల్లా ఇంకా పరిమళాలు పంచినట్లు 

మూడు వారిన ఎడారిలో 
ఏడు రంగుల తోడు కాంతి మెరిసినట్లు 

ఆమె ఈ లోకంలో మళ్లీ మళ్లీ పుట్టింది!!

మరణాన్ని జయించి మొగలిపూల ఆలి లా
గులాబీల పరిణయం ప్రణయం అని చెప్పినట్లు 

ప్రాణవాయువు పుట్టిన చెట్ల శ్వాసల్లో మనిషి మలినమైనట్లు 
నేల పరిశోధనల్లో నేరం మట్టిది కాదు 
మనిషి పుట్టుకదని తేల్చి చెప్పినట్లు 

గాలిని విడిపించిన తొలిప్రేమను 
గాలిలా వ్యాపించిన తొలి స్వేచ్ఛను 
రెక్కలుగా తొడిగి పక్షిలా ఎగిరినట్లు 

ఆమె ఈ లోకంలో మళ్లీ మళ్లీ పుట్టింది!!

శూన్యాన్ని వెలుగుల్లో నింపి 
గగనాన్ని గమ్యాన్ని కలిపి కాలం మనిషి నాలుగు దిశల్లో ఉదయించినట్లు 

ఆకలి దోపిడీ లేనిది ప్రకృతి 
ప్రకృతి పై దాడి చేసింది ఈ ప్రపంచం 
మరో ప్రపంచం పిలిచినట్లు 

ఆమె ఈ లోకంలో మళ్లీ మళ్లీ పుట్టింది. 

తెల్లని ఆకుల ఆకాశం పై అక్షరాలు 
రాస్తున్న మొల్ల
నీటిపై తేలుతున్న అలల కలలను కంటున్న
మహిళలా

మేఘాల ఉఛ్వాస నిచ్వాసాల్లో 
తేలిపోతున్న కర్మజలంలా
ముల్లోకాల్లో పనుల్లో నిమగ్నమై మునిగి తేలుతున్న మునుల్లా 

అమె ఈ లోకంలో మళ్లీ మళ్లీ పుట్టింది!!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని. 

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు