సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-806
"అనురాగ మనురాగేణ ప్రత్యేష్టవ్యః"న్యాయము
******
అనురాగః అంటే ఎఱ్ఱదనము, భక్తి, సంబంధము, ప్రేమ, వాత్సల్యము.అనురాగేణ అనగా భక్తి చేత, సంబంధం చేత, వాత్సల్యము చేత,ప్రేమ చేత. ప్రత్యేష్టవ్య అనగా ముందు కోరదగినది అని అర్థము.
తాను అనురాగమును చూపి ఇతరుల అనురాగము పొందవలెను.అనగా "ఇచ్చి పుచ్చుకొమ్మన్నట్లు" అని అర్థము.
అనగా మనం ఇతరుల నుండి  అనురాగము లేదా ప్రేమ/ వాత్సల్యము పొందాలంటే ముందు మనం ఇతరులకు ఇవ్వాలి.అప్పుడే ఎదుటి వారి నుండి పొందగలం.దీనినే "ఇచ్చిపుచ్చుకోవడం" అంటారు.
 ఒక్క ప్రేమ లేదా అనురాగమేనా ఇచ్చిపుచ్చుకునేది? అంటే కాదనే చెప్పాలి. గౌరవం కూడా. ఆంగ్లంలో ఓ మాట ఉంది. "Give respect take respect "- "గౌరవం ఇవ్వు,గౌరవం పొందు" అని.
అందుకే మన పెద్దవాళ్ళు తరచూ అంటుంటారు "మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది" అని. మనం భూమిలో ఏ విత్తనాలు నాటితే ఆ విత్తనాలే మొలుస్తాయి. వేరేవి మొలవవు కదా!
అతి వేగంగా మారుతున్న  నేటి సమాజంలో  బంధాలు అనుబంధాల విలువలు కూడా మార్పు చెందుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అందులో  ప్రతి వ్యక్తి తాను అనురాగమును పంచుతూ కుటుంబం నుండి కూడా అంతకంటే రెట్టింపు అనురాగమును పొందే వాడు. అలా ఇచ్చి పుచ్చుకోవడంలోని మాధుర్యాన్ని,గొప్పతనాన్ని చవి చూసేవాడు.
కాలం మారింది. ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా మార్పు వచ్చింది. నేటి యువతకు, బాలలకు అందులోని గొప్ప తనం తెలియకుండా పోయింది.తల్లిదండ్రుల నుండి అనురాగము పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం నేర్చుకోవడం లేదు.తద్వారా మానవీయ సంబంధాలు పలుచబడటం నేడు మనం చూస్తున్నాం.
 ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి కారణం కుటుంబ వాతావరణం.వారికి సరియైన విధంగా అవగాహన కలగడం లేదు.ఆ గొప్ప తనం, అవగాహన కలిగించాల్సిన బాధ్యత అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కుటుంబానిదే. సంస్కృతి సంప్రదాయాల వారసత్వం ఎలాగైతే పరంపరగా అందుతుందో సంస్కారం, మానవీయ విలువలు కుటుంబం నుండే అందాలి.అది అందించాల్సిన  అవసరం,బాధ్యత  తల్లిదండ్రులూ,పెద్దలదే.దీనిని పసితనం నుండే అలవాటు చేస్తే మనిషితనం వారిలో పెంపొందుతుంది.కుటుంబ ఒడి నుండి చదువులమ్మ బడిలో చేరిన పిల్లలకు ఉపాధ్యాయుల నుండి వాటికి ఊతంగా మరెన్నో మానవీయ విలువలు నేర్పబడుతాయి.
 భగవద్భక్తులు కూడా ఈ "అనురాగ మనురాగేణ ప్రత్యేష్టవ్యః న్యాయము" గురించి చెబుతూ  మానవుడు మహనీయుడు అయితేనే మాధవుడుగా కొలువబడుతాడు,పిలువబడుతాడు అంటారు. అంటే భగవంతుని దృష్టిలో,'మానవ సేవ మానవుడు చేస్తే మాధవ సేవ చేసినట్లే అని అంటారు.భక్తులు మానవులకు సేవనూ,ప్రేమనూ , దయా,కరుణనను అందిస్తే భగవంతుని నుంచి ఇవన్నీ అందుతాయి" అని అర్థము.
 మొత్తంగా ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే  మనం ఇతరుల నుండి అనురాగము, గౌరవం పొందాలి అంటే ముందు మనం ఇవ్వడం నేర్చుకోవాలి.కాబట్టి  మనం అనురాగం, వాత్సల్యము,గౌరవం ఇతరులకు పంచుదాం.వారి నుండి పొందుదాం. మన చుట్టూ ఉన్న  బాల్యానికి వాటి విలువ తెలియజేసే ప్రయత్నం చేద్దాం.

కామెంట్‌లు