వీరమాత జిజియాబాయి...( నాటిక ): - సుమ కైకాల

 (బ్రాకెట్ లో ఉన్నది తెర వెనుక నుండి చెప్పాలి)

(భారతదేశాన్ని మొగలాయిలు పరిపాలిస్తున్నారు. అది మహారాష్ర్ట లోని సింద్ ఖేడ్ ప్రాంతంలోని ఒక శివాలయం... ఒక తురుష్కుడు మురికినీరు శివలింగంపై పోస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఎనిమిదేళ్ళ జిజీయా చూస్తోంది. ఆమెకు చాలా కోపం వస్తుంది. పరుగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్తుంది.)
జిజియా: నాన్నా! నాన్నా! తురుష్కుడు పరమ శివుని  మలినం చేసాడు. ఇది క్షమించరాని పాపం కదా?
ఆమె తండ్రి: చిన్నపిల్లవి, అవన్నీ నీకెందుకు? ఇవన్నీ మరచిపోయి వెళ్లి ఆడుకో! 
(కానీ జిజియా మరచిపోలేదు... సమయం కోసం ఎదురుచూస్తోంది. జిజియాకి  బోన్స్ లే వంశానికి చెందిన షాజీ బోన్స్ లే తో పెళ్లయింది. అతడు ఔరంగజేబు ఆస్థానంలో గుమాస్తాగా పనిచేసేవాడు. జిజియా పెళ్ళైన నాలుగు రోజులకు భర్తతో ఇలా సంభాషిస్తుంది)
జిజియా: జీ! పవిత్ర గంగానదిని తురుష్కులు కలుషితం చేస్తున్నారు. గోహత్యలు చేస్తున్నారు. ఆడవారి పట్ల కనీస మర్యాద చూపించడం లేదు. ఏమిటీ దారుణం?
షాజి: జిజియా! మన పెళ్లయి నాలుగు రోజులైంది. నువ్వు నాతో మాట్లాడవలసిన మాటలు ఇవేనా?
జిజియా: అది కాదు జీ! ఎన్నాళ్ళు ఈ తురుష్కుల పాలనలో ఉండాలి? మీరు వారి సామ్రాజ్యాన్ని కూలదోసే ప్రయత్నం చేయొచ్చు కదా? 
షాజీ: నేను పని చేస్తుంది పరాయి వారి కొలువులోనని తెలిసి ఇలాంటి విషయాలు అడగడం సరి కాదు. మాట్లాడకుండా వెళ్లి పని చేసుకో!
(జిజియా చాలా బాధపడింది. తండ్రి మాటలకన్నా భర్త మాటలు ఆమెను ఎక్కువ బాధపెట్టాయి. ఆ నిస్సహాయత నుండి ఆమెలో ప్రతీకారజ్వాల పుడుతుంది. దానితో ఆలోచించడం మొదలు పెట్టింది. ఎలా? ఎలా? ఎలా?...
నా దేశం పరువు కాపాడేందుకు నేనే ఒక కొడుకును కంటాను... మొగలాయిల ఆట కట్టిస్తానని మనసులోనే గట్టిగా ప్రతినబూనింది. ఆ విషయంలో ఆమె ఆలోచన ఆగలేదు. వరుసగా ఒక మగపిల్లవాడు, ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఆమె అనుకున్న కోరిక తీరలేదు. ఆమెలోని పట్టుదల ఇంకా పెరిగింది. ఎనిమిదవ గర్భం దాల్చింది. నిరంతరం దుర్గాదేవి పూజలు చేస్తూ కటికనేల మీద పడుకునేది)
షాజి: నువ్వు గర్భవతివి అయినా విశ్రాంతి తీసుకోకుండా గుర్రపు స్వారీ, కత్తిసాము చేస్తున్నావు. కొండలు అవలీలగా ఎక్కుతున్నావు. ఇది నీ ఆరోగ్యానికి క్షేమం కాదు. 
జిజియా: ప్రభూ! నాకు రాముడిలా ధర్మప్రవర్తన, దుర్గాదేవిలా పరాక్రమం కలిగిన బిడ్డ కావాలి. అతడు నా దేశానికి పరాయిపాలన నుండి విముక్తి కలిగించాలి. అదే నా ప్రగాఢమైన కోరిక!
(జిజియా దేశాన్ని రక్షించే ధైర్యవంతుడైన బిడ్డ పుట్టాలని నిరంతరం భవానీ మాత పూజలు చేస్తుండేది. గర్భంలోని శిశువుకు భారత, రామాయణ గ్రంథాలు స్పష్టమైన ఉచ్చారణతో వినిపించేది. ఆమె విశ్వాసం వమ్ము కాలేదు. అనుకున్నట్లే పండంటి మగబిడ్డ పుట్టాడు. అతడే ఛత్రపతి శివాజీ!) 
(ప్రతీ శిశువుకి ముగ్గురు గురువులుంటారు.
 మొదట తల్లి
 రెండు బడి
 మూడు గుడి
శివాజీకి తల్లి శౌర్య , సాహసాలను ఉగ్గుపాలుగా పోసి పెంచింది. అత్యంత క్రమశిక్షణతో, రాజనీతి కౌశలాన్ని వివరిస్తూ జాగరూకత నైపుణ్యాలు తెలుపుతూ పరాక్రమవంతుడిని చేసింది.
బాల్యం నుండే శివాజీ ఎవరికీ తలవంచని ధైర్యవంతుడు. ఎప్పుడూ అతడి నడుముకు ఒరలో ఒక కత్తిని ధరించేవాడు. అతడికి ఐదేళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన)
ఒక తురుష్కుడు: హై హై 
( ఒక మొగలాయుడు రోడ్డు మీద గోవును కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అటుగా వెళ్తున్న శివాజీ అది చూస్తాడు. ఒరలోని కత్తి తీసి వాడిని బెదిరించి గోవును గోశాలలో చేర్పిస్తాడు)
మరో సంఘటన:
శివాజీ: నాన్నగారు! ఈ రోజు మీతో పాటు నేను కూడా రాజసభకు వస్తాను.
షాజీ: శివాజీ! నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదు. కానీ ప్రభువుల వారి సన్నిధిలో వినయంగా మసలుకోవాలి.
శివాజీ: అలాగే నాన్నగారు! మన దేశాన్ని దురాక్రమణ చేసిన వారిని చూడాలని ఉంది.
షాజీ: అయితే నాతో రా బాబూ!
(శివాజీ తండ్రితో కలిసి ఔరంగజేబు సభకు వెళ్తాడు.)
షాజీ: సలాం వాలేకుమ్... సలాం వాలేకుమ్... సలాం వాలేకుమ్
(షాజీ సభలోకి ప్రవేశించగానే అక్కడ కొలువుతీరి ఉన్న పెద్దలకు తల వంచి నమస్కారాలు చెప్తూ నడుస్తూ తనకు కేటాయించిన ఆసనంలో కూర్చుంటాడు. కానీ బాల సింహంలాంటి శివాజీ రాచఠీవితో ఎవరికీ సలాం కొట్టకుండా తలవంచకుండా వచ్చి తండ్రి పక్కన కూర్చుంటాడు. అది చూసి షాజీ చాలా భయపడతాడు)
ఔరంగజేబు: షాజీ! ఈ బాలుడు ఎవరు? 
(కోపంగా అంటాడు)
షాజీ: ప్రభూ! వీడు నా పుత్రుడు పేరు శివాజీ... వాడు పసివాడు. రాజసభ చూడటం ఇదే మొదటిసారి. సభామర్యాదలు అతడికి తెలియదు. మొదటి తప్పుగా నా కొడుకును మన్నించండి.
(నమస్కారాలు చెప్తూ ప్రాధేయపడతాడు)
ఔరంగజేబు: మీరు ఇంత ప్రాధేయపడుతున్నా వీడిలో కాస్తయినా నదురు, బెదురు లేదు. 
(ఆవేశంగా అంటాడు)
షాజీ : శివాజీ! లేచి ప్రభువుల వారిని మన్నింపు కోరు. 
(షాజీ అప్పటి వరకు అక్కడే ఆసనంలో కూర్చుని అంతా చూస్తున్న శివాజీ చేయి పట్టుకుని లేపుతూ అంటాడు.)
శివాజీ: నాన్నగారు! నేను ఎటువంటి తప్పు చేయలేదు.
(షాజీ ఆ మాటలు విని చాలా భయపడతాడు. అప్పటికే ఔరంగజేబు కోపంతో మండిపడతాడు)
ఔరంగజేబు: వీడు చూడటానికి మాత్రమే చిన్నవాడు కానీ గట్టివాడు. వీడిని బంధించండి.
షాజీ:  ప్రభూ! కనికరించండి 
(ప్రాధేయపడుతుంటాడు)
ఔరంగజేబు: వీడిని తక్షణమే నా ముందు నుండి తీసుకు వెళ్ళకపోతే నేనేo చేస్తానో నాకే తెలియదు.
(కోపంగా అంటాడు)
(షాజీ కొడుకును తీసుకుని అక్కడనుండి బయటకు వెళ్ళిపోతాడు. శివాజీ బాల్యం నుండే ఎవరికీ తల వంచని సాహసవంతుడు.)
(శివాజీ పదహారు సంవత్సరాల వాడయ్యాడు. తోరణదుర్గాన్ని జయించాడు. శివాజీని బంధించడానికి ఔరంగజేబు తన ఆస్థానంలో పని చేస్తున్న షాయిస్తఖాన్ ని ఆజ్ఞాపిస్తాడు. అతడు శివాజీకి మేనమామ, చాలా బలవంతుడు. షాయిస్తఖాన్ తన బలగంతో శివాజీ దగ్గరకు వస్తాడు.  శివాజీ తన ఒరలోని కత్తి తీసి అతడి ఐదు వేళ్ళూ నరికేస్తాడు. ఈ వార్త విని ఔరంగజేబు నిలువెల్లా వణికిపోతాడు)
మరో సంఘటన:
అంబాజీ సోనదేవ్ అనే సైనికుడు శివాజీకి అత్యంత ఆత్మీయుడు... నమ్మినబంటు. అతడు ఒక కోట మీద దాడి చేయడానికి వెళ్తాడు. అక్కడ పోరాటంలో విజయం సాధిస్తాడు. ఓడిపోయిన రాజు కుమార్తె చాలా అందగత్తె. సుకుమార లావణ్యవతి. ఆమెను చూడగానే సోన్ దేవ్ కి ఆమెను శివాజీకి ఇచ్చి వివాహం జరిపించాలని కోరిక కలుగుతుంది. వెంటనే ఆమెను బంధించి పల్లకీలో శివాజీ వద్దకు తీసుకువస్తాడు. 
సోన్ దేవ్:  ప్రభూ! మీ కోసం ఒక అపురూపమైన బహుమతి తీసుకువచ్చాను. ఇటు చూడండి...
(పల్లకీ ముసుగు తొలగించి చూపిస్తాడు. అందులో కూర్చున్న రాకుమారిని చూసి శివాజీ ఆశ్చర్యపోతాడు)
శివాజీ: సోన్ దేవ్! ఎవరీమె?
సోన్ దేవ్: ప్రభూ! మీతో పరిణయం చేయడానికి రాకుమారిని నాతో తీసుకువచ్చాను.
("ఆ యేమీ? యొక రాణీవాసమును రుణ్యావాసమున్ దెచ్చినా
వా? యే హైందవుడైన నీ గతినమర్యాదన్ బ్రవర్తించునే?
మా యజ్ఞాన్ గమనింపవో? జయ మదోన్మాదంబునన్ రేగి, నీ 
యాయుస్సూత్రము లీవ తృంచుకొనెదో? యౌద్ధత్య మోర్వన్ జుమీ")
శివాజీ: ఏంటీ? ఇది ఒక హిందువు చేయవలసిన పనేనా? ఆడవారిని గౌరవించే దేశంలో పుట్టినవారు ఇలాగే ప్రవర్తిస్తారా? ఎంత నీచమైన పని చేసావో తెలుసా?
(చాలా కోపంగా అంటాడు)
సోన్ దేవ్: ప్రభూ! నన్ను మన్నించండి.
శివాజీ: నీ తక్షణ కర్తవ్యం ఈమెను సగౌరవంగా మన ఇంటి ఆడబడచు లాంఛనాలతో వారి ఇంటి దగ్గర దింపడం.
శివాజీ: సోదరీ! నా సేవకుడు తెలియక చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. 
(శివాజీ యువరాణి ముందు తల వంచి నమస్కారo చేస్తాడు.)
యువరాణి: ప్రభూ! ఆడవారిని గౌరవించే నీలాంటి ఉత్తముడిని కన్న మీ తల్లికి నా శతకోటి ప్రణామాలు.
(యువరాణి నమస్కరిస్తూ అంటుంది. తరువాత సోన్ దేవ్ చీర, సారెలతో యువరాణిని తిరిగి వారి రాజ్యం చేరుస్తాడు. శివాజీ తల్లి ఆలోచనలతో, యుద్ధప్రణాళికలతో తురుష్కవంశాన్ని తుదముట్టించాడు. సువిశాల భారతదేశాన్ని హిందూ సామ్రాజ్యంగా మార్చేసాడు. ఒక తల్లి అనుకుంటే ఏదైనా సాధించగలదు.  దేశానికి ఉపయోగపడే ఒక మంచి కార్యం కోసం జీజియాబాయి కఠోర తపస్సు చేసి అనుకున్నది సాధించింది. మన దేశాన్ని సుభిక్షంగా పాలించిన పాలకుడిని కన్నది. శివాజీ అప్పటి కాలంలోనే "అష్ట ప్రధాన్" అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన గొప్ప ధర్మపాలకుడు.)
***

కామెంట్‌లు