మూడొంకాయలు - డా.ఎం.హరికిషన్

 ఒకూర్లో ఎల్లన్నని ఒకడుండేటోడు. వానికి చిన్నప్పటి నుంచీ వంకాయ కూరంటే చానా చానా ఇష్టం. కానీ ఆ వూర్లో ఆ సమ్మచ్చరం ఎవరూ వంకాయ తోట ఎయ్యలేదు. దాన్తో తినాలని ఎంత కోరికున్నా వంకాయలు దొరకక బాధపడా వుండేటోడు.
ఒకరోజు వానికి పనుండి పక్కూరికి పోతా వుంటే దారి నడుమ ఒక చెట్టుకు మూడు వంకాయలు కనబన్నాయి. దాండ్లను చూడగానే వాని నోట్లో సర్రున నీళ్ళూరినాయి. "ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు" అని లొట్టలేసుకుంటా బెరబెరా ఆ మూడు కాయల్నే తెంపుకోని, పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చేసినాడు.
అట్లా ఇంటికి రావడం, రావడం పెండ్లాన్ని పిల్చి “ఏమే!...నాకు పక్కూల్లో కొంచం పనుంది. జర్రున పోయి జర్రునొస్తా. అంతలోపల బాగా మసాలా యేసి ఈ మూడు కాయల్తో ఘుమఘుమలాడేలా గుత్తి వంకాయ కూరొండు. రుచి గనుక బాగా లేదనుకో కిందా మీదా యేసి తంతా చూడు" అని చెప్పెల్లిపోయినాడు.
ఆమె చానా అమాయకురాలు. మొగుడు ఎట్లా చెప్తే అట్లా చేయడం తప్ప ఆమెకు ఏమీ తెలీదు. దాంతో మొగుడు చెప్పినట్లే ఆ మూడు వంకాయలూ తీసుకోని, మాంచి మసాలా చేసి, వంకాయలకు నాలుగువైపులా గాట్లు పెట్టి, లోపలంతా మసాలా కూరి పొయ్యిమీదికి ఎక్కిచ్చింది.
కాసేపున్నాక ఆమెకు వంకాయలు బాగా ఉడికినాయా లేదా అని అనుమానమొచ్చింది. కూర బాగాలేకపోతే మొగుడు తన్నినా తంతాడనుకోని భయపడి చూద్దామాగు అని ఒకటి తీసుకోని నోట్లో ఏసుకోని వుడికిందో లేదో చూసింది. బాగా ఉడికిందిలే ఇంకా భయం లేదు. నా మొగుడు బాగా మెచ్చుకొంటాడు అనుకొంది.
కాసేపున్నాక ఆమెకు మల్లా వంకాయలకు ఉప్పూ కారం బాగా పట్టిందా లేదా అని అనుమానమొచ్చింది. కూర బాగా లేదనుకో మొగుడు తన్నినా తంతాడని భయపడి “చూద్దామాగు" అని ఇంగోదాన్ని తీసి నోట్లో ఏసుకోని ఉప్పూకారం పట్టిందో లేదో చూసింది. బాగా సరిపోయింది ఇంక భయం లేదు అనుకొంది.
అంతలో ఆమె మొగుడు పనులన్నీ పూర్తిచేసుకొని వంకాయ కూర తిందామని వురుక్కుంటా ఇంటికొచ్చినాడు. ఇంట్లోకి రావడం, రావడం వానికి మసాలా వాసన ఘుమ్మని తగిలింది. నోట్లో నీళ్ళు సర్రున వూరుతా వుంటే పల్లెం తెచ్చుకొని ముందు పెట్టుకోని "ఏమే! వాసన అదిరిపోతా వుంది! దాదా... తీసుకోనొచ్చి ఏద్దురా. ఆకలి చంపేస్తా ఉంది" అన్నాడు.
ఉడికిందా లేదా అని ఒకటి, ఉప్పూకారం పట్టిందా లేదా అని మరొకటి వండేటప్పుడే తినేసింది గదా! ఇంగ అక్కడ మిగిలినేది ఒకే ఒక్కటి. దాంతో ఆమె వాని పళ్ళింలో ఆ ఒక్క వంకాయనే వేసింది. అది చూసి వాడదిరిపడ్డాడు. 
“అదేందే! నేను తెచ్చినేది మూడయితే నువ్వు ఒకటే ఏసినావు మిగతా రెండూ ఏమయిపోయినాయి" అన్నాడు కోపంగా.
దానికామె "నువ్వేగదా రుచిగా లేకుంటే కిందా మీదా ఏసి తంతాననింది. అందుకే వంట చేస్తా... చేస్తా... ఉడికిందో లేదో చూద్దామని ఒకటి, ఉప్పూకారం పట్టిందో లేదో చూద్దామని మరొకటి తిన్నా" అనింది.
దానికి వాడు "ఏమే! నీకు తెలీదా వంకాయ కూరంటే నాకెంత ఇష్టమో? ఐనా తెలిసి తెలిసీ ఎట్లా తింటివే ఆ రెండూ" అన్నాడు కోపంగా.
ఆమె అమాయకురాలు గదా దాంతో “ఎట్లా తింటివే" అని మొగుడు అడుగుతా వున్నా చూపియ్యకపోతే ఏమంటాడో ఏమో అని బెదపడి వణికిపోతా వానీ పళ్ళెంలో వున్న ఆ ఒక్క వంకాయను గబుక్కున నోట్లో వేసుకోని నములుతా "ఇదిగో ఇట్లా తింటి" అని చూపిచ్చింది.
***********
కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం