నీతోనే నీవు,నీలోనే నీవు:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి, సికింద్రాబాద్.
 నీతో నీవు యుద్ధం చేయ్
నిన్ను నీవు నడిపించుకో
నీకు నీవు తప్ప ఎవరున్నారు?
నీ అడుగులు తడబడకుండా,
నీ కనులు మసకబారకుండా,
నీ చేతలే నిన్ను నిలబెట్టేలా,
నీకు నిన్ను చూపించుకో
నిర్భయంగా ముందుకు సాగిపో
నిశ్చయమైన దారి నీకుంది
నింగి మాత్రమే హద్దుగా ఉంది
నీ కర్తవ్యం నీకు మాత్రమే తెలుసు
అలుపున్నా,నొప్పున్నా నిటారుగా నిలుచో
సహజాతాల సాహచర్యాన్ని అదిమి పట్టుకో
సందేహాల ఆలోచనలు మానుకో
ఏ నడకైనా గమ్యం చేరడానికే.
నీలోకి నీవు చూసుకున్నప్పుడు
నీ ప్రతిబింబమే కనిపిస్తుంది.
అది తప్పక కనువిప్పు కల్గిస్తుంది.
వెక్కిరించిన నోర్లు మూతపడేలా
దిమ్మతిరిగి బొమ్మ కనబడేలా
రంగులు రంగరించి,
చిరునవ్వు పూయిస్తూ,
నిన్ను నీవు పలకరించుకుంటూ,
నిన్ను నీవు ప్రేమిస్తూ,
నిజాల్ని ఒప్పుకుంటూ
నిర్ణయమే సత్వరంగా తీసుకుంటూ
నిస్సిగ్గుగా,నిరపేక్షగా సాగాలి.
‌నింగి వంగి పూదండ మెడలో
అలంకరించగా
నిన్ను నీవు చూసుకోవాలి.
నీ వాళ్ళను తెలుసుకోవాలి.
కావలి కాసే ఓర్పును జతచేసుకొని
విస్మయం కలిగించే విజయమే
నీ అలవాటుగా మారాలి.
నిన్ను నీవు ప్రోది చేసుకొని
నిర్నిద్రాగానం మాని
సుప్రభాతాల సుమేధను మేల్కొల్పి
విజేతవు కావాలి
విస్పష్టమైన దృక్పథంతో
విశ్లేషణ జరగాలి.
విషయ వాంఛల విషవలయాన్ని చేధించాలి.
విబుధ విమహంకృతివై రాటుదేలాలి.
గెలుపొందినా,ఓడినా స్థితప్రజ్ఞుడవై,శ్రీమంతుడవై,
అభినందనుడవై జన్మసార్థక్య
మొనరించుకోవాలి.

కామెంట్‌లు