సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు -796
పతంగ దీప న్యాయము
****
పతంగము అనగా పక్షి లేదా మిడుత అని అర్థము.
దీపము అనగా వెలుగు, ప్రకాశము,కాంతి.
పతంగ దీపము అనగా  మిడుత మరియు దీపము.
మిడుతకూ దీపానికి సంబంధం ఏమిటి అని అనిపిస్తుంది. కానీ మనం చూసే మిడతలు చిన్న పురుగులు  ఇంట్లో వెలుగుతున్న ట్యూబ్ లైట్, దీపము మొదలైన వాటి చుట్టూ తిరుగుతూ ఆ వేడి సెగకు కాలి చనిపోవడం చూస్తూ వుంటాం కదా!.అందులోంచి వచ్చిందే ఈ 'పతంగ దీప న్యాయము'.
శరీరాన్ని  దీపం సెగ/ అగ్ని శిఖ కాలుస్తుందని తెలిసి కూడా తనకు ఇష్టమైన ఆహారంగా  భావించి మిడుత దీపము మీదికే పోయి ఆ సెగకు మాడి మసై నశిస్తుంది. 
అలా  పోయినప్పుడు వేడి , మంట తగలడం తో ఆగిపోవచ్చు కదా! కానీ ఆగదు ఆశ, వ్యామోహం అలాంటిదన్న మాట. ఒంటికి బాధ కలిగినా వెలుగుతున్న దీపం దగ్గరకు పోవడం మాత్రం ఆపదు.అలా బాధను భరిస్తూనే దీపకాంతి దగ్గరకు పదే పదే పోయి ఆ వేడికీ,సెగకు ఒళ్ళంతా కాలి మరణిస్తుంది.
మనము దానిని అలా వెళ్ళకుండా ఎన్ని సార్లు రక్షించాలని ప్రయత్నించినా, తీసి అవతల పడేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ  మంట దగ్గరకు పోతూనే ఉంటుంది.ఇక చివరకు ఒళ్ళు కాలి చచ్చిపోతుంది.
ఆహారము అనే భ్రాంతి, మోహము మిడుతను అంతలా ఆకర్షింప జేస్తుందన్న మాట.
దీనినే తెలుగులో "దీపం చుట్టూ శలభం" అంటారు.శలభము అంటే మిడుత/దీపపు పురుగు. 
 ఎర్రగా వెలుగుతున్న దీప శిఖ యొక్క ఆకర్షణీయమైన రూపము మిడతకు దాని దగ్గరకు చేరి ఎలాగైనా తినాలన్నంత మోహాన్ని కలిగిస్తుంది.దానిని తినలేనని తెలిసినా ప్రయత్నం ఆపదు. దానిని తినాలనే కోరిక  మిడతను నిలువనీయదనీ,ఆ విపరీతమైన మోహమే యుక్తాయుక్త విచక్షణ కోల్పోయేలా చేస్తుందనీ, ఆ మోహమే చివరికి మిడుత ప్రాణాలు కోల్పోయేలా చేసిందని  ఈ న్యాయము వల్ల మనము అర్థం చేసుకోవచ్చు.
 దీనినే  మనుషులకు వర్తింప చేస్తే...  మనిషిలోని ఆశ పరిమితంగా తనకు, ఇతరులకు నష్టం కలిగించనంత వరకు ఫరవా లేదు.కానీ ఆ ఆశే అత్యాశగా మారితే అలాంటి వ్యక్తిని మార్చడం చాలా కష్టం. ఆ విపరీతమైన వ్యామోహమే చివరికి జీవితాన్ని పతనావస్థకు తీసుకుని వస్తుందని గ్రహించేలా చెప్పిన వేమన పద్యాన్ని చూద్దాం.
నీళ్ళ లోని చేప నెరి మాంస మాశకు/ గాలమందు చిక్కి గూలినట్లు/ ఆశబుట్టి మనుజుడారీతి చెడిపోవు/ విశ్వదాభిరామ వినురవేమ!".
అంటే  చేప నీళ్ళలో తిరిగి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అలాంటిది కంటికి ఎదురుగా ఎరను చూసినప్పుడు తినాలన్న  ఆశ ఎప్పుడైతే చేపలో  పెరిగిందో  అదే దాని చావుకు ముహూర్తం పెట్టుకున్నట్లు.అలా ఆశ, వ్యామోహానికి లోనైన చేప గాలానికి చిక్కి చనిపోతుంది. అందుకే ఆశ అనేది ఎంతో ప్రమాదకరమనీ,ఈ ఆశ వల్లనే మనుషులు కూడా చెడిపోతారని అంటాడు వేమన.
ఇలాంటి అత్యాశ గురించే మరో పద్యంలో ఇలా అంటాడు... '
 'నక్కనోటి కండ నదిలోని మీనుకై/ తిక్కపట్టి విడిచి మెక్కు చెడుద/ మక్కువైన గద్ద మాంసమెత్తుక పోవు/ విశ్వదాభిరామ వినురవేమ!"
 నక్క నోటిలో మాంసం ముక్కను పట్టుకొని వస్తూ , నదిలోని చేపను చూస్తుంది, దానిలో చేపను కూడా తినాలనే కోరిక పుడుతుంది. దాంతో చేపను పట్టుకోవడానికి మాంసం ముక్కను ఒడ్డున పెట్టి నీటిలోకి వెళుతుంది.
 అదంతా గమనిస్తున్న గద్ద మాంసం ముక్కను  తన్నుకు పోతుంది. నీటిలోకి నక్క రావడం చూసి  చేప అందకుండా నది లోపలికి  వెళ్ళిపోతుంది.అంటే అత్యాశ వలన నక్క మాంసం ముక్కనూ,చేపనూ రెంటినీ కోల్పోయింది.
 దీనిని బట్టి ఆశ ఉండాలి కానీ హద్దులు దాటకూడదనీ.అత్యాశఎంత  ప్రమాదమో చేప,నక్క ద్వారా  తెలుసుకున్నాం. 
ఇక షడ్గుణాలలో నాల్గవది అయిన మోహము, వ్యామోహంగా మారి చివరికి వ్యక్తిని మిడుతలా నశించి పోయేలా,పతనమై పోయేలా  చేస్తుంది.
తాను కోరుకున్న కోరిక పరిథి దాటి వ్యామోహముగా మారితే... అది చివరికి వినాశనానికే దారి తీస్తుందని ఈ "పతంగ దీప న్యాయము" ద్వారా  తెలుసుకోవచ్చు.
కాబట్టి అలాంటి వ్యామోహాలలో చిక్కకుండా మనసును అదుపులో పెట్టుకొని యుక్తాయుక్త విచక్షణతో ప్రతిదీ ఆలోచించి ఆచి తూచి అడుగు ముందుకు  వేద్దాం.

కామెంట్‌లు