వరహాల చెట్టు: -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212.

 ఒక ఊరిలో ఒక చిన్న పిల్లోడు వున్నాడు. వాళ్లు చానా పేదవాళ్ళు. ఒకపూట తిండి ఉంటే మరొకపూట వుండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేసి బతికేవాళ్ళు.
ఒకసారి పండగొచ్చింది. ఊరు వూరంతా బాగా బచ్చాలు, మైసూరుపాకులు, గులాబుజాములు, జిలేబీలు చేసుకొని హాయిగా తింటా వున్నారు. కానీ వీళ్లు చానా పేదవాళ్లు గదా... దాంతో ఏమీ చేసుకోలేదు. గంజిలో ఇంత బెల్లం వేసుకోని అదే పాయసం అనుకోని తాగి మట్టసంగా వున్నారు.
వాళ్ల పక్కింటిలో రంగయ్య అని ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. వాడు పిల్లికి గూడా బిచ్చం పెట్టని రకం. ఎవరైనా పచ్చగా కలకలలాడుతా వుంటే చూసి తట్టుకోలేడు. తానొక్కడు హాయిగా వుంటే చాలు ఎవరెలా పోతే నాకేమి అనుకునేవాడు.
రంగయ్య వాళ్ళింటిలో పండగకు తీయని మైసూరుపాకులు చేశారు. రంగయ్య కొడుకు వాటిని జేబులో వేసుకొని ఇంటి బయట ఒక్కొక్కటే కొరికి కొరికి తినసాగాడు. అది చూసి ఈ పిల్లోనికి నోరూరింది. వాని దగ్గరికి పోయి ''రేయ్‌... నీ దగ్గర చానా మైసూరుపాకులు వున్నాయి గదా... ఒకటి ఇవ్వరా... నోరూరుతోంది'' అన్నాడు. వానికన్నీ వాళ్ల నాన్న బుద్ధులే. ''అబ్బా... మా నాన్న ఎవరికీ ఇవ్వవద్దన్నాడు. తెలిసిందంటే చావగొడతాడు. నేను ఇవ్వను'' అన్నాడు.
ఆ పిల్లోనికి చానా బాధ వేసింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఊరంతా హాయిగా పండగ చేసుకోని, కొత్త బట్టలు వేసుకోని, కావలసినవన్నీ చేసుకోని, తిని, సరదాగా ఆడతా పాడతా ఎగురుతా వుంటే... తమకు తినడానికి కూడా ఏమీ లేదు గదా అనిపించింది. ఒక్కడే ఊరి బయట వున్న అడవి లోకి పోయి వెక్కివెక్కి ఏడవసాగాడు.
ఆ అడవిలో ఒక సాధువు ఉన్నాడు. ఆయన ఆరోజు ఉదయం నదికి పోతా వుంటే దారిలో ఒక పులి వెంటబడింది. దాన్నుంచి తప్పించుకోడానికి చూసుకోక ఒక ఊబిలో కాలు పెట్టాడు. అంతే... సర్రున దానిలోనికి దిగబడిపోయాడు. బయటకు రాలేక గిలగిలలాడసాగాడు. పులి కాసేపు ఆ ఊబి చుట్టూ తిరిగి ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. సాధువు నెమ్మది నెమ్మదిగా ఊబిలో దిగబడిపోతా వున్నాడు. ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని ఎదురుచూసీ చూసీ... ఎవరూ రాకపోవడంతో ఇక చావు తప్పదు అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ పిల్లోడు అటువైపు వచ్చాడు.
సాధువు ఆ పిల్లోన్ని చూసి ''బాబూ... నన్ను కాపాడు'' అంటూ గట్టిగా అరిచాడు. పిల్లోడు అది విని అటువైపు వురుక్కుంటా వచ్చాడు. సాధువు అప్పటికే భుజాల వరకూ మునిగిపోయి వున్నాడు. తానేమో చిన్న పిల్లవాడు. సాధువేమో చానా పెద్దవాడు. అదీగాక ఊబిలో ఇరుక్కొని వున్నాడు. ఎలా బయటకి లాగడం అనుకున్నాడు. ఊరిలోకి పోయి జనాలను పిలుచుకొని వద్దామా అంటే అంతలోపు మునిగి చావడం ఖాయం. ఎలాగబ్బా... అని ఆలోచించాడు.
ఆ ఊబి పక్కన ఒక చెట్టు ఉంది. దాని ఒక కొమ్మ ఊబి పైకి వంగి వుంది. ఆ పిల్లోడు వేగంగా చెట్టు ఎక్కాడు. ఊబి పైన ఉన్న కొమ్మను బలంగా కిందికి వంచాడు. అది సాధువు తల మీదకు వచ్చింది. ''సామీ... ఆ చెట్టు కొమ్మను కాసేపు గట్టిగా పట్టుకో. నేను వురుక్కుంటా వూరిలోకి పోయి జనాలందరికీ విషయం చెబుతా. వాళ్లు వెంటనే వచ్చి నిన్ను కాపాడతారు'' అని గట్టిగా అరిచాడు. సాధువు అలాగేనంటూ ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొన్నాడు.
వెంటనే ఆ పిల్లోడు వేగంగా చెట్టు దిగి మెరుపువేగంతో ఊరిలోకి వురికాడు. కనబడిన వాళ్లకు విషయం అంతా చెప్పాడు. వెంటనే వాళ్లు ఒక పెద్ద తాడు తీసుకోని ఆ పిల్లోని వెంబడి ఊబి దగ్గరికి వచ్చారు. సాధువు గట్టిగా ఆ చెట్టుకొమ్మను పట్టుకొని మునిగిపోకుండా అలాగే ఉన్నాడు. వెంటనే వాళ్లు తాడును సాధువు వైపు విసిరారు. సాధువు ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడు. జనాలు నెమ్మదిగా అతన్ని ఊబిలోంచి బయటకు లాగారు.
సాధువు చానా సంబరపడ్డాడు. ''నీవు గనుక నన్ను చూడకపోతే ఖచ్చితంగా కైలాసం చేరటోన్ని. నీ తెలివితేటలే నన్ను కాపాడాయి. ఎవరు నీవు? మీ అమ్మా నాన్న ఎవరు?'' అంటూ ఆ పిల్లవాని గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వాళ్లు తినడానికి కూడా లేని పేదవాళ్లు అని తెలుసుకొని చానా బాధపడ్డాడు.
ఆ పిల్లవాన్ని తన కుటీరం దగ్గరికి తీసుకుపోయాడు. లోపలికి పోయి ఒక పెద్ద విత్తనం తీసుకొని వచ్చాడు.
''బాబూ... ఇది మామూలు అలాంటిలాంటి అల్లాటప్పా విత్తనం కాదు. చానా చానా మహిమలున్న మంచి విత్తనం. నీకు ఏది కావాలో కోరుకొని దీనిని మీ ఇంటి పెరడులో నాటు. తరువాత ఏమవుతుందో నువ్వే చూద్దువు కానీ'' అన్నాడు.
దానికి ఆ పిల్లోడు ''సామీ... పళ్ళు పూలే కోరుకోవాలా లేక మైసూరుపాకులు, జిలేబీలు, గులాబుజాములు గూడా కోరుకోవచ్చా'' అన్నాడు ఆశగా.
సాధువు చిరునవ్వు నవ్వి 'ఏమైనా కోరుకోవచ్చు. కానీ బాగా ఆలోచించుకోని కోరుకో' అన్నాడు.
ఆ పిల్లోడు సంబరంగా ఎగురుకుంటా ఇంటికి వచ్చాడు. ''సామీ... నాకు జిలేబీలు కావాలి అని కోరుకుంటా విత్తనాన్ని నాటాడు. బాగా నీళ్ళు పోశాడు. అది మరుసటి రోజుకల్లా మొలకెత్తి మోకాళ్లంత ఎత్తు పెరిగింది. రెండోరోజుకంతా కొమ్మలేసి మిద్దె ఎత్తు ఎదిగింది. మూడవరోజుకల్లా కొమ్మకొమ్మకు జిలేబీలు విరగకాశాయి. కమ్మని వాసన పెరడంతా గుమ్మని కొట్టసాగింది. నోటిలో వేసుకుంటే చాలు తీయగా సర్రున కరిగి పోసాగాయి. అంత రుచిగల జిలేబీలు ఎప్పుడూ తినలేదు. ఆ పిల్లోడు బెరబెరా ఒక పది తిన్నాడు. కొన్ని తెంపుకుని పోయి వాళ్ళ అమ్మానాన్నకు ఇచ్చాడు. అందరూ సంబరంగా లొట్టలేసుకుంటా కావలసినన్ని తిన్నారు. కానీ అలా ఒక వారం అయ్యేసరికి మొహం మొత్తిపోయింది. రోజూ మూడు పూటలా జిలేబీలే తినాలనుకునేసరికి విసుగనిపించింది. ''ఇలా జిలేబీల చెట్టు కోరుకునే బదులు ఏ బంగారు వరహాలు కాసే చెట్టునో కోరుకోనింటే ఎంత బాగుండేది. మన బాధలన్నీ తీరిపోయేవి'' అని చానా బాధపడ్డారు. తరువాత రోజు నుంచీ అవి తినబుద్ధి కాక మరలా కూలీకి పోవడం మొదలుపెట్టారు.
దాంతో ఆ పిల్లవాడు ఉరుక్కుంటా అడవిలోని సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి ''సామీ... ఈ జిలేబీల చెట్టు బదులు బంగారు వరహాలు కాసే చెట్టు ఇవ్వకూడదా'' అన్నాడు. దానికి సాధువు నవ్వి ''మీ ఇంటిలో ఇప్పుడు పెరిగింది కూడా వరహాల చెట్టే కదా. కొంచెం ఆలోచించు. నీకే సమాధానం దొరుకుతుంది'' అన్నాడు.
''జిలేబీల చెట్టును పట్టుకొని డబ్బుల చెట్టు అంటాడేమి ఈ సాధువు. అదెలా'' అని ఆలోచించుకుంటా తిరిగి ఇంటిదారి పట్టాడు. ఊరిలో ఒకచోట ఒకతను జామకాయలు గంపలో పెట్టుకొని అమ్ముతా ఉన్నాడు. వాటిని చూడగానే ఆ పిల్లోనికి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. ''ఆ సాధువు చెప్పింది నిజమే. అది జిలేబీల చెట్టు కాదు. డబ్బుల చెట్టే'' అని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు.
చెట్టెక్కి జిలేబీలన్నీ తెంపుకోని ఒక గంపలో పెట్టుకొని వీధిలోకి వచ్చి ఒక చెట్టు కింద గంప దించాడు. మామూలుగా ఒక జిలేబి ఐదు రూపాయలు. అలాంటిది మూడు రూపాయలకే అమ్మడం మొదలుపెట్టాడు. ఆ జిలేబీల రుచి చూసి అందరూ ''అబ్బా... ఎంత కమ్మగా ఉన్నాయి. ఇంతవరకు ఇంత రుచికరమైనవి మేము ఎప్పుడూ తినలేదు'' అన్నారు. దాంతో నిమిషాల మీద అన్నీ అయిపోయాయి. డబ్బులన్నీ తీసుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మానాన్నలకు చెప్పాడు. వాళ్లు ఆనందంగా అడవిలో సాధువు వున్న దిక్కుకెళ్ళి తిరిగి దండం పెట్టుకున్నారు. ఆరోజు నుంచీ పొద్దున్నే జిలేబిలన్నీ తెంపుకొని వీధి వీధి తిరుగుతా అమ్ముకోసాగారు. కొద్దిరోజుల్లోనే వాళ్లు బాగా ధనవంతులు అయిపోయారు.
ఎంత ధనవంతులైనా వాళ్లకు ఆకలి బాధలు తెలుసు. అన్నానికి అల్లాడిన రోజులు మరచిపోలేదు. దాంతో తమ దగ్గరున్న డబ్బులతో మంచి పనులు చేయడం మొదలుపెట్టారు. ఊరిలో పిల్లలు చదువుకోడానికి మంచి బడి కట్టించారు. ఊరిలో నీళ్లకు ఇబ్బంది లేకుండా పెద్దబావి తవ్వించారు. దారులకు రెండువైపులా కాలువలు తవ్వించి మంచి పళ్ళమొక్కలు నాటించారు. దాంతో వాళ్లకు ఊరిలో మంచిపేరుతో పాటు గౌరవము కూడా వచ్చింది.
వాళ్ల పక్కింటిలో రంగయ్య అనే పీనాసోడు వున్నాడు కదా... వానికి ఇది చూసి కన్నుకుట్టింది. అసూయతో రగిలిపోయాడు. ''ఎలాగైనా సరే తాను కూడా సాధువు దగ్గరికి పోయి అలాంటిదే ఒక విత్తనం సంపాదించి బంగారు వరహాలు కోరుకుంటే ఊరిలో అందరికన్నా ధనవంతుడు కావచ్చు'' అనుకున్నాడు.
దాంతో బాగా ఆలోచించి వాళ్ల బావమరిదిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. తరువాతరోజు ఇద్దరూ అడవిలో దాచిపెట్టుకుంటా సాధువు వున్న కుటీరం దగ్గరికి చేరుకున్నారు. రోజూ పొద్దున్నే సాధువు నదికి వెళతాడు కదా... అలా బయలుదేరగానే రంగయ్య బావమరిదికి సైగ చేశాడు. వెంటనే వాడు ఎలుగుబంటిలా వేషం వేసుకున్నాడు. సాధువు వెంటపడ్డాడు. సాధువు ఎలుగుబంటిని చూసి అదిరిపడ్డాడు. దాని నుంచి తప్పించుకోడానికి వేగంగా వురకసాగాడు. ఆ ఎలుగుబంటి కూడా వదలడం లేదు. అది వేగంగా రెండుకాళ్ళ మీద వురుకుతా వెంట పడటంతో సాధువుకు అనుమానం వచ్చింది. చిన్నప్పటి నుంచి అడవిలోనే పుట్టి పెరిగినోడు గదా... ఏ జంతువు ఎలా వురుకుతాదో, ఎగురుతాదో, దుంకుతాదో బాగా తెలుసు. దాంతో ఎవరో కావాలని ఎలుగుబంటి వేషం వేసుకొని వెంటపడ్డాడు అనుకున్నాడు. సాధువు అలా వురుక్కుంటా నది దగ్గరికి చేరుకోగానే ఎలుగుబంటి వేగంగా వచ్చి సాధువును నదిలోనికి తోసేసింది. సాధువుకు ఈత బాగా వచ్చు. కానీ ఎలుగుబంటి ఎందుకలా నదిలోకి తోసేసిందబ్బా అని ఆలోచించుకుంటా ఈత రానోని మాదిరి కాళ్ళూచేతులు టపటపా కొట్టుకోసాగాడు.
సాధువు ఎప్పుడైతే నదిలో పడ్డాడో... మరో నిమిషంలో రంగయ్య అక్కడకు వచ్చాడు. ''సామీ... నువ్వేమీ భయపడొద్దు. నేను కాపాడుతా'' అంటూ ఎగిరి దూకి సాధువు దగ్గరకు చేరుకొని నెమ్మదిగా బయటకు తీసుకొని వచ్చాడు.
ఆ తరువాత రంగయ్య సాధువుతో ''సామీ... నువ్వు ఆపదలో వుంటే నిన్ను కాపాడాను గదా... కాబట్టి నాకు గూడా మా పక్కింటి పిల్లోనికి ఇచ్చినట్టు ఏమి కావాలంటే అది కాసే విత్తనం ఒకటి ఇవ్వవా'' అన్నాడు.
సాధువుకు రంగయ్య ఉపాయం తెలిసిపోయింది. ''ఓహో... ఇందుకా వీడు ఈ ఎలుగుబంటి నాటకం ఆడి నన్ను భయపడిచ్చింది'' అనుకున్నాడు. వెంటనే చిరునవ్వుతో ''అలాగే రంగయ్యా... నా వెంబడి రా. నీవు కోరుకున్నట్టే విత్తనం తీసుకొని పోదువు గానీ'' అంటూ కుటీరం దగ్గరకు తీసుకుపోయాడు. లోపలికి పోయి ఒక విత్తనం తీసుకొని వచ్చాడు. అది బంగారు రంగులో మెరిసిపోతా వుంది. రంగయ్య దానిని తీసుకొని సంబరంగా ఇంటికి బయలుదేరాడు.
సాధువు ఆలోచనలో పడ్డాడు. ''మనిషి ఆశ చెడ్డది. రంగయ్యలాగే మరికొందరు విత్తనాల కోసం రావచ్చు. ఇవ్వకపోతే బెదిరించవచ్చు. దాడిచేయొచ్చు. చంపొచ్చు. కాబట్టి ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు'' అనుకోని ఆ అడవిని వదిలేసి ఎవరికీ తెలియని, ఎప్పటికీ కనుక్కోలేనంత దూరమున్న మరో అడవికి వెళ్ళిపోయాడు.
రంగయ్య సంబరంగా బంగారు విత్తనాన్ని తీసుకొనివచ్చి పెరటిలో నాటాడు. అది మరుసటి రోజుకంతా మోకాలెత్తు పెరిగింది. తరువాత రోజుకంతా మిద్దెత్తు పెరిగింది. మూడవరోజే కదా బంగారు వరహాలు కాసేది. దాంతో రంగయ్య ఆరోజు నిదురపోతే ఒట్టు. ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఎప్పుడెప్పుడు వరహాలు తెంపుకొందామా అని ఎదురుచూడసాగాడు. చీకటి తొలగిపోగానే పెద్ద గోనెసంచి తీసుకొని వురుక్కుంటా ఆ చెట్టుకాడికి పోయాడు.
పోతే... ఇంకేముంది. చెట్టు నిండా అడుగడుగునా పెద్ద పెద్ద తేళ్లు. ఒక్కొక్కటి అరచేయంత లావుగా వుంది. కొండితో ఒక్కటేసిందంటే చాలు చచ్చి గుంతలోకి పోవడం ఖాయం. ఒకొక్క తేలు చెట్టు దిగి పెరడంతా తిరగసాగాయి. నెమ్మదిగా ఇల్లంతా తేళ్లతో నిండిపోయింది.
రంగయ్య భయపడి పిల్లాపాపలతో ఆ ఇల్లు వదిలి బయటకు పారిపోయాడు.
***********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం