బహుమతి...:- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి-944156155

  ఎనిమిదవ తరగతిలోకి పెద్ద సారు వచ్చారు. అతడు వచ్చాడంటే  ఏదో ఒక విషయం చెప్పడానికి వస్తాడని పిల్లలంతా అనుకుంటారు. అతడు క్లాసులోకి అడుగుపెట్టగానే నమస్కారం సార్ అంటూ విద్యార్థులు లేచి బిల బిల మంటూ నిలబడ్డారు. అతడు తన చేతితో సైగ చేస్తూ పిల్లల్ని కూర్చోమన్నాడు. అందరూ కూర్చొని హెడ్మాస్టర్ సార్ ఏమి చెబుతాడోనని నిశ్శబ్దంగా ఎదురుచూడ సాగారు. " హాయ్ పిల్లలూ ... రేపటినుండి మనకు దసరా సెలవులు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా సెలవులను ఎంజాయ్ చేయండి. ఈత కోసం చెరువుకుంటలలోకి ఒంటరిగా వెళ్లవద్దు. బతుకమ్మ పూల కోసం జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మమ్మ, నానమ్మల  ఇంటికి వెళ్లి హాయిగా సెలవులు గడపండి. వాళ్లు చెప్పిన కథలను వినండి. మీకు తోచిన కథలను వాళ్లకు చెప్పురి. సెలవులు అయిపోయినంక స్కూలుకు రండి. వచ్చిన తర్వాత  బతుకమ్మ పండుగ ఎలా చేశారో, సెలవులను ఎలా గడిపారో తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక వ్యాసం రాయండి. వాటన్నింటినీ  తెలుగు టీచర్ కు ఇవ్వండి. బాగా రాసిన వారికి బహుమతులు ఉంటాయి" అని తెలిపారు. నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున  బహుమతులు అందజేస్తాం అని కూడా అన్నారు. 
     పిల్లలంతా  సరే సార్ అంటూ తలలు ఊపారు.   టన్ టన్ టన్ మంటూ ఇంటి బెల్ కొట్టగానే పిల్లలంతా ఎంతో హుషారుగా ఇంటికెళ్లారు. ఆ బహుమతులను తామే పొందాలని ఎవరికి వారే ఊహించుకున్నారు. తెల్లారి నుండే అమ్మమ్మ, తాతయ్యల ఇండ్లకు వెళ్లారు. అదే రోజు   పెత్తారమాస  కావడంతో ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ మొదలైంది. పిల్లల సంతోషానికి అవధులు లేవు. గడ్డి పూలు,గోరింక పూలు తేవడానికి  బావుల దగ్గరికి వెళ్లారు. కనిపించిన  రకరకాల పూలను తెంపుకొచ్చారు. పచ్చని పంట పొలాలను ఆస్వాదించారు. రకరకాల ప్రకృతిలోని చెట్లను కనులారా చూశారు. ఆ వాతావరణం చూసిన పిల్లలకు వింత లోకం అనిపించింది. తెచ్చిన వివిధ పూలతో సాయంత్రం అమ్మమ్మలు,నానమ్మలు తీరొక్క పూలతో  బతుకమ్మలను పేర్చారు. ఇంటి ఆడపిల్లలు కొత్త బట్టలు ధరించి గుడి దగ్గర బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఎంతో సంబురంగా బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత వాటిని  అన్నదమ్ముల సహాయంతో చెరువు నీటిలో వదిలి వాయనం తీసుకున్నారు. ఇట్లా నవరాత్రులు  ఆడినంక జోర్దార్ గా దసరా పండుగ చేశారు.
     పిల్లలకు సెలవు దినాలలో పల్లె వాతావరణం బాగా నచ్చింది. వరుసలతో పిలుచుకున్న జనం... నీతి నిజాయితీగా ఉండే గుణాలు, కపటం అంటే ఏమిటో తెలియని మనుషులు, పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు ఎంతో గమ్మత్తుగా అనిపించినవి. చూస్తుండగానే సెలవులన్నీ తొందరగా అయిపోయినవి.  వెంటనే వదిలి వెళ్లాలని లేకున్నా తప్పని పరిస్థితుల్లో  ఎంతో హృద్యంగా సొంత ఇండ్లకు  వచ్చారు . బడికి వచ్చేటప్పుడు పూసగుచ్చినట్లుగా అన్ని అంశాలను రాసి తెలుగు ఉపాధ్యాయురాలికి వ్యాసాలను  అందజేశారు. ఇక ఆ సంగతే మర్చిపోయారు. ఈ లోగా బాలల దినోత్సవం రానే వచ్చింది. పాఠశాలలో పండుగ వాతావరణం ఏర్పడింది. పిల్లలు, టీచర్లు ఎంతో ఉత్సాహంగా వాళ్ల వాళ్ల పనులలో నిమగ్నమయ్యారు.
         మధ్యాహ్నం రెండు గంటలకు బాలల దినోత్సవం కార్యక్రమము ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేశారు. పిల్లలు,టీచర్లు అందరూ పాఠశాల స్టేజి వద్ద సమావేశం అయ్యారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వేదిక మీదకి అతిధులను ఆహ్వానించాడు  మొదటగా హెడ్మాస్టరు సమావేశం ప్రాధాన్యత గురించి చెప్పారు. 9వ తరగతి శృతి పాట పాడింది. పదవ తరగతి  విద్యార్థులు గ్రూప్ డాన్స్ కూడా చేశారు. ఒకరిద్దరు ఉపాధ్యాయులు కూడా మాట్లాడారు. తదనంతరం  వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రథమ బహుమతి పొందిన అనూష తన వ్యాసాన్ని స్టేజ్ మీద నుండి చదివి వినిపించారు. వ్యాసం బాగా రాసి ప్రథమ బహుమతి పొందినందుకు చప్పట్లు మారుమ్రోగాయి. బహుమతి పొందిన అనూషను అందరూ అభినందించారు.
       

కామెంట్‌లు