నక్క నటన...:- -- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
  ఒక అడవిలో చాలా జంతువులు,పక్షులు నివసించేవి. అందులో నక్క కూడా ఉండేది. నక్క తనకున్న మోసకారి అనే పేరు తుడిపేసుకోవాలనుకుంది. అందుకుగాను నక్క మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంది. అడవిలోని జంతువులనే కాక సినిమా యాక్టర్లను కూడా               అనకరిస్తూ  ఉండేది. కృష్ణాష్టమి పండుగకు శ్రీకృష్ణుని పాత్ర ధరించి ఏకపాత్రాభినయం చేయాలనుకుంది. నక్కను మిగతా జంతువులు ప్రోత్సహించసాగాయి. నెమలి తన తోకకున్న ఈకల్ని పీకి ఇచ్చింది. దాన్ని తన తలపై పెట్టుకుంది.  కోయిల  తన వద్దనున్న పిల్లన గ్రోవిని ఇచ్చింది. నక్క తన పెదవిపై పెట్టుకుని గానం చేసింది. పాలపిట్ట రంగురంగుల దుస్తుల్ని ఇచ్చింది. వాటిని తన శరీరానికి పెట్టుకుని నృత్యం చేసింది. నక్క ఎంతో వినయంగా  నటిస్తూ వచ్చింది. పక్షులు జంతువులు ఆనందంగా చప్పట్లు కొట్టసాగాయి. మనస్ఫూర్తిగా అభినందించాయి.
      తర్వాత శివరాత్రికి  శంకరుడి వేషం కడతానంది. వెంటనే పులి తన వద్దనున్న చర్మం ఇచ్చింది. ఎలుగుబంటి డమరుకం, తొడేలు త్రిశూలం ఇచ్చాయి. వాటితో శివతాండవం చేసి పక్షుల్ని జంతువుల్ని సంతోషపరిచింది. నక్కను అడవిలోని జంతువులు, పక్షులన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. నక్కకు మంచి పేరు వచ్చింది. దాన్ని ఎట్లైనా సొమ్ము చేసుకోవాలని నక్క ఆలోచించి టికెట్ పెట్టింది. టిక్కెట్టుకొని మరి నక్క వేసిన నాటకాలు చూడు సాగాయి. దీంతో నక్కకు డబ్బు, కీర్తి కూడా వచ్చింది. గర్వం పెరిగింది. అడవిలోని జంతువులను, పక్షులను  ఎగ తాళి చేయ సాగింది. ఎవరినీ లెక్కచేయకుండా ప్రవర్తించ సాగింది. దీనితో జంతువులకు, పక్షులకు కోపం వచ్చింది . ఇంకా నక్క నాటకాలు ఎవరు చూడకూడదని, దానికి ఆర్థిక సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నాయి. నక్కను నాట్యం చేయమని అడగడం కానీ, మాట్లాడటం కానీ, ఏ పక్షులు, జంతువులు చేయలేదు. వాటిని పలకరించినా మాట్లాడకుండా వెళ్ళిపోసాగాయి. నక్క ఒంటరిదైపోయింది. అది వేసే నాటకాలను చూసే వారే లేరు. ఒంటరి జీవితం పిచ్చెక్కినంత పని అయింది. తను చేసిన తప్పేమిటో తెలిసి వచ్చింది. జంతువుల్ని,  పక్షుల్ని పేరుపేరునా క్షమాపణ కోరింది. ఇకముందు ఎవరినీ బాధ పెట్టనని ఒట్టేసింది. అప్పటినుండి మళ్లీ అన్ని జంతువులు,  పక్షులు నక్కకు సహాయం చేయడమే కాకుండా సహకరిస్తూ ఉండేవి.
     నక్క ముఖానికి తిరిగి రంగేసుకుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున పోరాట వీరుల నృత్య రూపకం ప్రదర్శించింది. అడవిలోని అన్ని ప్రాణులను విపరీతంగా ఆకట్టుకుంది. స్వాతంత్రం వర్ధిల్లాలి. అమరవీరులకు జోహార్లు అన్న నక్క నటనను చూసి అడవి అంతా మారు మ్రోగింది. నక్క చాలా ఆనందించింది.  మోసబుద్ధి పోగొట్టుకుంది. మంచి నక్కగా జీవించ  సాగింది .
   

కామెంట్‌లు