ఒకప్పుడు అవంతిపురాన్ని అలకనందుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా మంచివాడు. తన పుట్టినరోజున ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి పని చేసేవాడు. యేట తన రాజ్యంలోని కారాగారంలో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయడం అనవాయితీగా వస్తుంది.
అనేక తప్పులు చేసి జైలుకు వచ్చిన ఖైదీలంతా కరుడుగట్టిన నిరస్తులే. అటువంటి నేరస్తులను ఒక్కొక్కరిని పరిశీలించి సత్ప్రవర్తన కలిగిన ఒక ఖైదీని విడుదల చేయడం రాజు యొక్క ధ్యేయం.
రాజు తన పుట్టినరోజు నాడు జైలుకు వచ్చి అనేక మంది ఖైదీలను పరిశీలిస్తున్నారు. ప్రతి ఖైదీ రాజుకు ఎదురుగా వచ్చి నమస్కారం తెలియజేస్తూ తమను విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
ఒక ఖైదీ వచ్చి " అయ్యా! నేను ఏ నేరము చేయలేదు. అన్యాయంగా పోలీసులు జైలుకు పంపారు. ఈ చీకటి గదిలో గడుపుతున్నాను. దయచేసి నన్ను పంపించండి" అనే వేడుకున్నాడు.
రాజు ముందుకు వెళుతుండగా మరో ఖైదీ వచ్చి" నేను చాలా మంచి వాడిని. ఎవరో చేసిన తప్పుకు నన్ను బలి చేశారు. ఇంటిదగ్గర నా కుటుంబం ఇబ్బందిగా ఉంది. మహారాజా! నీ కాల్మొక్త నన్ను పంపించండి. అని బ్రతిమిలాడాడు.
ఇంక కొంచెం ముందుకు వెళ్తుండగా ఇంకొక ఖైదీ వచ్చి" రాజా! మాది మంచి వంశం. మా పూర్వీకులు గొప్ప పేరు పేరున్న వారు. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. తప్పు చేయకుండా నన్ను జైల్లో పెట్టారు. దయతో నన్ను విడుదల చేయండి " అని అన్నాడు.
ఇలా ఖైదీలందరూ ఏదో ఒక మంచి విషయం గురించి రాజుకు చెబుతున్నారు . తమనే విడుదల చేయాలని ఎవరికి వారే తాపత్రయం పడుతున్నారు . రాజు మాత్రం అందరి మాటలు వింటూ మౌనంగా ముందుకు వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక గదిలో ఒంటరిగా కూర్చుని గ్రంధాన్ని చదువుతున్న ఒక ఖైదీని గమనించాడు. అతన్ని రాజు దగ్గరకు పిలిచాడు. జైలుకు ఎందుకు వచ్చాడో వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
మహారాజా! నేను కడు నిరుపేదను. నాకు నలుగురు పిల్లలు. చేసిన కష్టంతో సంసారం సాదలేక చిల్లర దొంగతనాలకు అలవాటుపడ్డాను. ఒకరోజు క్షణికావేశంలో పెద్ద తప్పు చేసి జైలుకు వచ్చాను. నన్ను క్షమించండి. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. నన్ను మాత్రం విడుదల చేయకండి. నాకు ఈ జన్మకు తగిన శాస్తి జరగాల్సిందే" అని దీనంగా తన గురించి చెప్పాడు.
రాజు ఆ ఖైదీ యొక్క నిజాయితీ మాటలకు కరిగిపోయాడు. కుటుంబ పోషణ కోసం క్షణికావేశంలో చేసిన తప్పులను క్షమించాలని అనుకున్నాడు. అతనిలోని నిజాయితిని మెచ్చుకొని వెంటనే విడుదల చేశాడు.
ఇంటికి వెళ్లిన ఖైదీ ఇకనుండి ఏ తప్పులు చేయకుండా కష్టించి పనిచేస్తూ నిజాయితీగా బతక సాగాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి