చెట్లు లేకుండా
పూలు పూయించేవాడు
కాయలు కాయించేవాడు
ఎవడయ్య వాడు?
మబ్బులు లేకుండా
వానలు కురిపించేవాడు
కాలువలు పారించేవాడు
ఎవడయ్య వాడు?
నీరు లేకుండా
నదులను ప్రవహింపజేసేవాడు
పడవలను నడిపించేవాడు
ఎవడయ్య వాడు?
నిప్పు లేకుండా
అగ్గి రగిల్చేవాడు
మంటలు మండించేవాడు
ఎవడయ్య వాడు?
కాలు కదపకుండా
శిఖరానికి చేరేవాడు
లోయలోనికి దిగేవాడు
ఎవడయ్య వాడు?
భోజనం పెట్టకుండా
కడుపులు నింపేవాడు
ఆకలి తీర్చేవాడు
ఎవడయ్య వాడు?
పానీయం ఇవ్వకుండా
గొంతులు తడిపేవాడు
దప్పిక తీర్చేవాడు
ఎవడయ్య వాడు?
నిద్దుర పోకుండా
కలలు కనేవాడు
కల్పనలు చేసేవాడు
ఎవడయ్య వాడు?
కళ్ళకు కనపడకుండా
కవ్వింపులకు గురిచేసేవాడు
కమ్మదనాలు కలిగించేవాడు
ఎవడయ్య వాడు?
నోరు విప్పకుండా
తేటపలుకులు విసిరేవాడు
తేనెచుక్కలు చల్లేవాడు
ఎవడయ్యవాడు?
ఎవడయ్య వాడు
ఇంకెవడు వాడు
మన కవివర్యుడు
మనకు రవితుల్యుడు
ఎవడయ్య వాడు
ఇంకెవడు వాడు
సరస్వతీ పుత్రుడు
సాహితీ ప్రియుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి