ఏప్రిల్ ఫూల్ : సరికొండ శ్రీనివాసరాజు
 పిల్లలు రోడ్డుపై నడుస్తున్నారు. రోడ్డు మీద సైకిలుపై వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి, "అంకుల్! వెనుక టైరులో గాలి పోయింది." అన్నారు. అతడు చూసుకున్నాడు. "ఏప్రిల్ ఫూల్." అంటూ పరుగెత్తారు పిల్లలు. ఒక ఆవిడ నెత్తి మీద నీళ్ళ కుండ వేసుకొని వెళ్తుంది. "ఆంటీ! కుండకు చిల్లు పడి నీళ్ళు కారుతూ ఉన్నాయి." అన్నారు పిల్లలు. చూసుకుంది. "ఏప్రిల్ ఫూల్." అంటూ పరుగెత్తారు పిల్లలు. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఫూల్ చేయడం పిల్లల పని అయింది. 
    ఒక పెద్ద మనిషిని ఇలాగే ఏప్రిల్ ఫూల్ చేయాలని ప్రయత్నం చేశారు పిల్లలు. "ఒరేయ్! మీకు చదువు చెప్పిన గురువులు ఎవరు? పెద్ద వాళ్ళతో ఇలాగే ప్రవర్తించమని చెప్పారా?" అన్నాడు ఆ పెద్ద మనిషి. పిల్లల నోట మాట లేదు. "నీ ఈడు పిల్లలను, నీ స్నేహితులనూ ఫూల్ చేసుకోండి. పెద్ద వాళ్ళకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి." అన్నాడు పెద్ద మనిషి. ఇంతలో అక్కడ ఇద్దరు అమ్మాయిలు శ్రుతి, గీతాంజలి నడుచుకుంటూ వెళ్తున్నారు. శ్రుతి ఇలా అన్నది. "గీతా! ఈ పిల్లలు మా పాఠశాలలోనే చదువుతారు. వీళ్ళు ఎప్పుడూ వాళ్ళ క్లాసులో టాప్." "అవునా! కంగ్రాచ్యులేషన్!" అన్నది గీతాంజలి. "ఓ గీతా! ఏప్రిల్ ఫూల్. వాళ్ళకంత సీన్ లేదు." అంటూ నవ్వింది శ్రుతి. ఆ పిల్లలు సిగ్గుతో తల దించుకున్నాడు. పెద్దలతో పరిహాసం ఆడినందుకు ఫలితం ఇది.

కామెంట్‌లు