ఆరోగ్యం...అరచేతిలో స్వర్గం..!:- కవి రత్న సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి,అత్తాపూర్ హైదరాబాద్
శరీరమే...దేవాలయం...
ఆరోగ్యమే...
ఆత్మారాధ్య దేవత...
విజ్ఞానంతో చేసే
పూజలు...నిత్య కర్మలు...
అభిషేకాలే...వ్యాయామం...
చేసే దీపారాధనే...ధ్యానం...
విశ్రాంతిని ప్రసాదించే యాగమే...యోగా

సూర్యునికి నమస్కరిస్తే భక్తితో...
పరుగెడుతుంది...రక్త ప్రవాహం...
వేగంగా జీవనదిలా జలపాతంలా...!

ధ్యానం...ఒక శ్వాస యాత్ర...
మనశ్శాంతినిచ్చే మౌనపు మంత్రం...
యోగంతో...శరీరం ఒక శిల్పమవుతుంది
వ్యాధి...అనే విఘ్నం మాయమవుతుంది.!

అనుభవవంతులు ఆశాజీవులన్నారు...
"నియమబద్ద జీవితం నిత్యసుందరమని.!
"దయగల హృదయమే దైవమందిరమని.!

కోట్లు పోసి మందులు కొనొచ్చని...‍కానీ 
ఆవగింజంతైనా ఆరోగ్యాన్ని కొనలేమని...
ఆరోగ్యమే మహాభాగ్యమని సౌభాగ్యమని.!

బద్ధకానికి స్వస్తి చెప్పమని...
చింతల చీకటిలోకి జారిపోవద్దని..!

చిరునవ్వే ఆరోగ్యానికి చుక్కలదీపమని
చేసే వ్యాయామాలు యోగా ధ్యానాదులే...
సిరిసంపదల సజీవ నదులని...నిధులని..!

పదిగంటలకు పడకే...
నాలుగు గంటలకు నడకే...
సౌభాగ్య ద్వారాలని...
ఆరోగ్యానికి ఔషదాలని...
ఆనందానికి ఆభరణాలని..!

అందుకే ఓ మిత్రమా...
మన శరీరాలయంలో కొలువైఉన్న
ఆరోగ్య దేవతను పూజిద్దాం...
ఆరోగ్యానికై బద్దకాన్ని బంధిద్దాం...
ప్రశాంతత కోసం స్వేదం చిందిద్దాం..!

ఆరోగ్యమే మహాభాగ్యం...
అది అరచేతిలో దాగిన స్వర్గం...
మన చిత్తశుద్ధి...మన చలనం....
మన చైతన్యం...శారీరక మానసిక శ్రమే
ఆరోగ్య‌దేవతకు అర్పించే సుమమాల..!



కామెంట్‌లు