కవితలను
రమ్మంటే రావు
చిన్నగాతియ్యగా ఊరుతాయి
తోడుకోమంటాయి త్రాగమంటాయి
కవితలను
శాసిస్తే లొంగిపోవు
రక్తిశక్తిచూపమని కోరుకుంటేనే
వెలువడుతాయి వేడుకచేస్తాయి
కవితలను
భయపెడితే లొంగవు
బ్రతిమలాడి బుజ్జగిస్తేనే
కాగితాలకెక్కి కనువిందుచేస్తాయి
కవితలను
తొందరపెడితే ఒప్పుకోవు
నిదానంగా సహనంతో అభ్యర్ధిస్తేనే
దిగివస్తాయి మురిపిస్తాయి
కవితలను
కావాలంటే పుట్టవు
అందాలుచూపించి
ఆనందంకలిగిస్తేనే జనిస్తాయి
కవితలను
పరుగుపెట్టమంటే ఒప్పుకోవు
ఓర్పునేర్పు చూపితేనే
పెళ్ళికూతురులా నడుచుకుంటూవస్తాయి
కవితలను
వెలిగిస్తామంటేనే
రవికిరణాల్లా
రమణీయంగా ముస్తాబయివస్తాయి
కవితలను
గుబాళించమంటేనే
సౌరభాలు వెదజల్లుతూ
సుమాల్లా సంబరపరుస్తాయి
కవితలను
ఆస్వాదించేలా ఉంటేనే
శ్రావ్యంగా సుతారంగా
కళ్ళముందుకు వస్తాయి
కవితలను
కురవమంటే కురవు
వాణీదేవి కరుణిస్తేనే
కలాలనుండి జాలువారుతాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి