న్యాయములు-822
"ఈర్ష్యా హి వివేక పరి పంథినీ" న్యాయము
**"***
ఈర్ష్యా అనగా అసూయ, ఆగ్రహము,కసి, క్రోధము, ద్వేషము.హి అనగా కాబట్టి,ఖచ్చితంగా,అందుకని లేదా ఎందుకంటే.వివేచన అనగా తెలివి, జ్ఞానము,మంచి చెడులను వేరు చేసే శక్తి. ప్రి అనగా చుట్టూ,నడుమ, ద్వారా. పంథిని అనగా మార్గం చూపేవాడు లేదా మార్గదర్శి అనే అర్థాలు ఉన్నాయి
ఈర్ష్య వివేకమునకు శత్రువు.ఈర్ష్యాళువుకు యుక్తాయుక్త వివేచనము ఉండదు అని అర్థము.
మనకన్నా గొప్ప వారిని చూసి కలిగేది.ఇతరుల ఉన్నతి చూసి ఓర్వలేక పోవడం.వేరొకరికి ఉన్నది మనకు లేనప్పుడు అది వాళ్ళ స్వంతం అయ్యిందని బాధ పడటాన్ని ఈర్ష్య అంటారు.
ఈ ఈర్ష్య అనేది ఒకానొక బలహీనత. ఈర్ష్య ఉన్న వ్యక్తికి ఆనందం ఆమడ దూరంలో ఉంటుంది.
ఇది మనసును ప్రశాంతంగా ఉండనీయదు. ఎప్పుడూ కలవరపెడుతుంది. మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. ఈ ఒక్క ఈర్ష్య అనేక అనర్థాలకు దారి తీస్తుంది.దీనివల్ల మనసులో అసూయ- ద్వేషాలు, అసహనం - అసంతృప్తులు తిష్ట వేస్తాయి. చిత్తం ఎప్పుడూ అల్ల కల్లోల సంద్రం వలె ఉంటుంది. అంత వరకు తనకు తాను ఇబ్బంది పడటమే కాకుండా ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. సహనం లోపించడం వల్ల ఎవరేమన్నా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు.
తనపై తనకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. దానికి కారణం ఇతరులే అన్న భావనతో వారి జీవితాల్లో ప్రవేశించి వారితో గొడవలకు దారి తీస్తుంది. కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది ద్వేషం,అసూయ పెచ్చు పెరిగి పండంటి జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది."వీరు మొహం ఎప్పుడూ మొట మొటలాడుతూ ఉంటుంది.
ఇలాంటి వారిని ఉద్దేశించి మన పెద్దలు ఉదాహరణగా అలాంటి వారికి కుళ్ళి కుళ్ళి కుడికన్ను - ఏడ్చి ఏడ్చి పోతుందని అంటారు.
ఈర్ష్య ఉన్న వారిలో యుక్తాయుక్త వివేచనము ఉండదు. ఎదటి వారి ఉన్నతిని, ఎదుగుదలను చూసి తట్టుకోలేక వారిని మాటలతో మానసికంగానూ హింసిస్తారు. మనసును గాయ పరుస్తారు.
మరి వారిని మార్చడం మనిషి తరమా? అవుతుందో లేదో తెలియదు కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి.ఎంతో దగ్గరి వారితో హితోక్తులు చెప్పించాలని. ఇలాంటి వారికి యోగా, ధ్యానం పరిచయం చేయాలి. వారి మనస్సుకు నచ్చిన మంచి పనులు చేసేలా చూడాలి. సహనం ఓపిక పెంచుకునేలా చేయాలి.
ఈమధ్య కాలంలో నేను చదివిన ఓ కథ దీనికి చక్కగా సరిపోతుంది.
ఒకానొక వ్యక్తి బాగా ధనవంతుడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనే కోరికతో.ఓ సాధువు వద్దకు వెళ్ళి తన జాతకం చూపి ఇంకా సంపాదించ గలనా? చెప్పండి స్వామి అంటాడు.
అప్పుడు సాధువు అతడి చేయిపట్టుకుని చూసి సంపాదించడం మాట దేవుడెరుగు!. నీ ఆయుష్షు ఇంకో వారం రోజులు మాత్రమే అనేసరికి ఆ మనిషిలో పశ్చాత్తాపం. తాను అప్పటి నుంచి అందరితో మంచిగా మాట్లాడుతూ, కోపగించిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ధనాన్ని అవసరమైన వారికి పంచి పెడతాడు.ఎంతో నిశ్చింతగా ఉంటాడు. వెళ్ళి సాధువుతో నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుందో చెప్పగలరా ? అని అడిగితే సాధువు నవ్వి నాయనా ఇప్పుడు నీకు దొరికినట్టే.
ఇంత కాలం ఈర్ష్యతో వివేకమునకు దూరమై సంపాదన ఆర్జనలో ఎంతో మందిని బాధ పెట్టావు. వారం రోజుల్లో చనిపోతానని తెలియగానే నీలో మార్పు వచ్చింది. మంచి మనిషిగా మారావు. ఇక నుండి ఇదే భావనతో జీవించు, యోగా ధ్యానం చేయమని చెబుతాడా సాధువు.*ఆ విధంగా ఆ వ్యక్తిలో మంచి మార్పు వస్తుంది.
మనము కూడా ఆ వ్యక్తి కథే కాదు రామాయణం భాగవతం,భారతంలో దుర్యోధనుడు , శిశుపాలుడు, శూర్పణఖ లాంటి వారి కథలు కూడా కొంత వరకు ఈ కోవకు చెందినవే.ఈ ఈర్ష్యా హి వివేక పరి పంథినీ"న్యాయము ద్వారా ఎలా ఉండకూడదో మనం తెలుసుకోగలిగాం .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి