సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు -835
ఊహాపోహ న్యాయము
******
ఊహ అనగా పరీక్షణము, నిర్థారణ,అధ్యాహారము.అపోహము అనగా లేనిది ఊహించుకొనుట లేదా తప్పుడు నమ్మకము అనే అర్థాలు ఉన్నాయి.
ఒకదానిలో లీనమై యుండి ప్రత్యక్షముగా కనబడిన దానిని తెలుసుకొనడము ఊహ. లేనిదానిని ఉన్నదానినిగా ఆరోపించడము అపోహము. ఊహాపోహములు కలవాడంటే ఒక విషయము గురించి బాగుగా ఆలోచించేవాడని అర్థము.
 ఊహలు అంటే ఏమిటో చూద్దాం. ఏదైనా విషయాన్ని గురించి అనుకునే నమ్మకాలు లేదా అభిప్రాయాలు.వాటిని నిజమని భావించకుండా, ఋజువు లేకున్నా,లేదా ఖచ్చితంగా జరుగుతుందని అనుకోవడం అంటే అంతగా నమ్మకం పెట్టుకోవడం అన్నమాట.
మరి ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అంటే ఎక్కువగా మనలోని అంతర్ దృష్టి నుండి,గత అనుభవాల నుంచి, మనకున్న జ్ఞానం నుండి వస్తుంటాయి.ఉదాహరణకు ఫలానా ఇలా జరుగుతుంది,అలా అవుతుంది అని మనలో కొంతమంది చెబుతుంటారు. వాళ్ళు ఊహించి చెప్పిన దాంట్లో కొన్ని నిజం అవుతుంటాయి.కారణం  ఒక్కటే గతానుభవాల ఫలితాలు వాళ్ళు పొందడమో, పొందిన వారిని చూడటమో జరిగి వుండవచ్చు.అందుకే జరుగబోయే వాటిని ఊహించి చెప్పగలిగే జ్ఞానం వారిలో అంతర్లీనంగా ఉండటం వల్ల చెప్పగలరు.
 మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఆ పరిస్థితుల్లో ఎలా ఉండాలో , అక్కడ మన పాత్ర ఏమిటో ముందే ఊహించుకుంటాం. అంతే కాదు మనం ఏదైనా పనిని చేయాలని, ఫలానా మార్గాన్ని ఎంచుకోవాలని ముందే ఊహించుకోవడం.
ఈ ఊహల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మనలోని సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం కనిపిస్తుంది.కొత్త కొత్త ఆలోచనలు వస్తూ కొత్త ఆవిష్కరణలకు ఈ ఊహలు బాటలు వేస్తాయి.ముఖ్యంగా సాహిత్యం, కళలు అభివృద్ధి చేసుకోవడానికి  వినూత్నంగా సరికొత్త అంశాలను పరిచయం చేసేందుకు ఈ ఊహలు సహాయ పడతాయి. సరదాగా మరో ప్రపంచాన్ని, స్వర్గం నరకం లాంటివి ఊహించుకుంటూ  తీసిన యమలీల, యమగోల లాంటి సినిమాలు కూడా ఉదాహరణగా చెప్పవచ్చు.
ఈ ఊహలపై మన కవులు, సినీ గేయ రచయితలు  అనేక పాటలు రాశారు.
 "ఊహలు గుసగుసలాడే" ఊహల పల్లకిలో ఊరేగడం,ఊహలే ఊహలే నిను విడువవులే-, ఊహలకందని లోకంలో..ఇలా అనేక పాటలు ఉన్నాయి.
 ఊహలు మన జ్ఞానాన్ని పెంచడానికి, మనలోని అనుభవ జ్ఞానం విస్తరింపజేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే సామాజిక పరంగా, శాస్త్ర,సాంకేతిక రంగాల్లో విషయాలను అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి ఊహలు కీలకమైన పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి, అనుమానం లేదు.ఇలా  ఊహలు ప్రతి మనిషి జీవితంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తాయని నొక్కి వక్కాణించవచ్చు.
ఇక అపోహ అంటే లేని దానిని ఊహించుకోవడం. వాస్తవాన్ని కాకుండా అవాస్తవాలని నిజమని నమ్మడం,తప్పుగా ఆలోచించడం... ఇదంతా విషయాలను సరిగా ఆలోచించక పోవడం వల్ల వస్తుంది. అపోహలు మన నిర్ణయాలను, నమ్మకాలపై ప్రభావాన్ని చూపుతాయి. ఒకోసారి అనుబంధాలు, బంధాల మధ్యనున్న దగ్గరితనం నుంచి దూరం చేస్తాయి.
 అయితే మనం కొంతమంది గురించి ఆహారపదార్ధాలను గురించి కొన్ని అపోహలు పెంచుకుంటాం.అది రెండు రకాలైన మంచి, చెడుగా ఊహిస్తూ అపోహ పెంచుకుంటాం. కానీ దగ్గరైతే కానీ ఎవరు ఎలాంటి వారో, ఏవి మంచో, ఏవి చెడో వాటి ఉపయోగాలు తెలిసిన తర్వాత మనం అప్పటి వరకూ ఊహించుకున్న వాటికి , అపోహ పడిన వాటికి వాస్తవిక రూపం తెలుస్తుంది. అప్పుడు ఊహాపోహములు ఖచ్చితంగా తెలుస్తాయి.
 ఇలా ఊహాపోహములు వ్యక్తిని గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగ పడతాయి. విషయజ్ఞానిగా, సృజన శీలురు, బుద్ధి జీవులుగా సమాజ వేదికపై నిలిపి మనమేమిటో అర్థం చేసుకునేలా చేస్తాయి.
 కాబట్టి ఊహాగానాలు కాకుండా ఊహాపోహములు అప్పుడప్పుడు అవసరమేనని ఈ "ఊహాపోహ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవచ్చు.

కామెంట్‌లు