సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-830
"ఏక చిత్తం ద్వయో రేవం కిమ సాధ్యం" న్యాయము
****
ఏక అనగా  ఒక్కడు,ఒంటరి,స్థిరమైనది మారనిది, సాటిలేనిది.చిత్తం అనగా చూచుట,ధ్యానము,అవధానము,అభిప్రాయము,ఇచ్ఛ,మనస్సు ,హృదయము,తర్కము.ద్వయ అనగా జత, రెండు.రేవం అనగా ప్రేమ కిమ అనగా ఏమి?ప్రశ్నార్థకం.సాధ్యం అనగా చేయదగినది,గణ దేవతా విశేషము అనే అర్థాలు ఉన్నాయి.
"ఇద్దరూ ఒకే మనస్సుతో  ప్రేమతో పనిచేస్తే అసాధ్యమేముంటుంది?" అనగా ఏదైనా సాధ్యమే అని అర్థము.
 ఆ ఇద్దరూ ఎవరై ఉంటారు అనే ప్రశ్నకు చటుక్కున వచ్చే సమాధానం ఏమిటంటే భార్యాభర్తలు అని. ఎందుకంటే జీవితాంతం ఒకే చూరుకింద కలిసి బతుకుతూ, మరో తరానికి వారధులై, సరైన సారథ్యం వహించి, ఉత్తమమైన  పౌరులను తయారు చేసి సమాజానికి అందించే గురుతరమైన బాధ్యత ఆలూమగలదే.
కాబట్టి ఆ ఇరువురూ ఒకే మనస్సుతో ఆప్యాయత అనురాగంతో పనిచేస్తూ, సంసార రథానికి చక్రాలై సాఫీగా సాగిపోతూ ఉంటే  వారు కంటున్న కలలు, అందమైన ఊహలు అన్నీ నిజమై కళ్ళముందు నిలుస్తాయి.
 ఆలూమగలు ఇద్దరూ  కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ పనిచేస్తూ వుంటే ఎలా ఉంటుందో సినీ గేయ రచయిత కొసరాజు గారు "తోడి కోడళ్ళు " సినిమా కోసం రాసిన అందమైన పాటను ఒకసారి మననం చేసుకుందాం.
"ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే/ అలుపూ సొలుపేమున్నది/ఇద్దరమొకటై చేయి కలిపితే/ ఎదురేమున్నది మనకు కొదవేమున్నది" అంటూ రాసిన ఈ పాట భార్యాభర్తల అనుబంధాన్ని, అనురాగాన్ని , నూతనోత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపే విధంగా ఉంటుంది.
దీనికి చక్కని ఉదాహరణ సుధా మూర్తి ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి గార్ల జంట, వారి ఆదర్శ దాంపత్యం ఈ సమాజానికి ఎంత గొప్ప ఆదర్శంగా నిలిచిందో, ఎన్ని విజయాలు సాధించిందో మనందరికీ తెలిసిందే.
 భార్యా భర్తలే కాకుండా దీనినే మరో కోణంలో  చూసినట్లయితే ఏదైనా సంస్థనో, వ్యాపారాన్నో కలిసి పెట్టుబడి పెట్టి నడిపే ఇద్దరు స్నేహితులకో , బంధువులకో, మరెవరికైనా వర్తింపజేసి  చెప్పుకోవచ్చు.వారు చేసే పనిలో అభివృద్ధి సాధించాలంటే , వారి  ఆశయాలు ఆచరణ రూపం ధరించి  అనుకున్న  ఫలితాలు పొందాలంటే ఆ ఇరువురూ ఒకే మనసుతో కలిసి పనిచేయాలి. ఇక వారి అభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
 "ఒక్క చేత్తో చప్పట్లు మోగవు"రెండు కరములు కలిస్తేనే కరతాళ ధ్వనులు. ఒక మంచి పని కోసం ఒకరికి ఒకరు తోడుగా నడుస్తూ, నీడగా వెంట వస్తూ విజయాలను సొంతం చేసుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంది. ఆత్మ తృప్తి కి కొదవేముంది.
 కనుక కలిసి బతకడంలో ఒకే మనస్సుతో పనిచేస్తూ ఉండాలని చెప్పేందుకే మన పెద్దలు ఈ "ఏక చిత్తం ద్వయో రేవం కిమ సాధ్యం" న్యాయమును సృష్టించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
 ఈ న్యాయము చెప్పినట్లు కలిసి మెలిసి ఉంటే సానుకూల దృక్పథం అలవడుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా అలవోకగా అధిగమించవచ్చు. ఇలా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అందుకే ఈ న్యాయమును ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం.

కామెంట్‌లు