చుక్కలతో చెబుతా:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చుక్కలతో 
చెబుతా 
చెంతకు రమ్మని 
చక్కదనాలు చూపమని

తారకలతో
అంటా
మా ఇంటికొచ్చి
గోడలపై నివసించమని

నక్షత్రాలతో
చెపుతా
మాగడప ముందుకొచ్చి
ముగ్గుల్లో కూర్చోమని

భాసంతులతో
వేడుకుంటా
మా ఆడువారినుదుటకెక్కి
వెలుగులు చిమ్మమని

ఉడువులతో
అభ్యర్ధిస్తా
రవ్వలు చిందమని
కళ్ళకు ఆనందమివ్వమని

భములతో
కోర్కెతెలుపుతా
చంద్రుడులేనప్పటికి
వజ్రాల్లా వెలుగమని

రిక్కలతో
చెప్పుతా
నా మదిలోదూరి
తళుకులు చిందమని

తారలతో
విన్నవించుకుంటా
నా అక్షరాలనధిరోహించి
కవితలను వెలిగించమని


కామెంట్‌లు