నీ నామ స్మరణము తప్ప
దివ్య మంత్రాలు తెలియని
పరమ అజ్ఞానిని నేను
అదే వేదమంత్రముగా భావించు శ్రీరామా!
తెలియక చేసిన తప్పిదములన్నీ
చిన్ని పాదముతో తల్లిని తన్నే
శిశువుగా భావించి
క్షమించి అక్కున చేర్చుకో కౌసల్యరామా!
నీవు పడ్డ కష్టాలు
నేను ఓర్వగలేను
నీవాడిగా ఎంచి దయతో
నాకు చేయందించు కారుణ్యరామా!
నీ పై భక్తి నా సంపద
నాపై నీ కరుణ నా భాగ్యము
నీ వలె ధర్మ మార్గమున
నన్ను నడిపించు కోదండరామా!
ఎదురు చూపులో నేను
శబరినే అయినాను
నీ కరుణ కోసమే వేచివున్నాను
కదలి రావేమయ్య కల్యాణరామా!?
దిశలెల్ల విశదముగా
నీ ఉనికి తెలిసేలా
మలయ మారుతమై
మమ్ము అలరింప రావయ్య సాకేత రామా!
నీ కరుణాసముద్రపు
చిరుతరగపై ఊగిసలాడే
చిన్ని పడవను నేను
దరి చేర్చు భారము నీదే పట్టాభి రామా!
నీవు నడిచే దారిలో
నీ కాలికింద జారుతూ తరించే
చిన్ని ఇసుక రేణువు నేను
పరమపదము చేర్చే బాధ్యత నీదే
అయోధ్య రామా!🙏
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి