నీకు కోపం రాగానే
రగిలే అగ్నిపర్వతంలా
లావాను విరజిమ్ముతావు
పిడికిలి బిగించి
మెరుపులా మండిపోతావు,
నీ కళ్ళలో రుద్ర తాండవం ఆవిష్కృతమై
నరనరానా విరుచుకుపడే తుపానులా
పట్టరాని ఉక్రోషంతో ఊగిపోతావు,
వేడిని ఎగజిమ్మే కుంభినివై అవతరిస్తావు.
బుద్ధి మసకబారితే
తప్పు ఒప్పులు తారుమారౌతాయి,
లోన కన్నీటి అలజడి మొదలౌతుంది,
గర్జించే సింహంలా ఆగ్రహిస్తావు
వాడివేడిగా అగ్గిరాల్లే మాటలతో
చుట్టు వాతావరణాన్ని తగలబెడతావు,
ఆ కొద్ది విషగడియల్లో
పెనుతుఫానులా విజృంభించి
విధ్వంసానికి రథసారథివైపోతావు.
కానీ...నీకు కోపం
కడలిలో అలలా ఎగసినప్పుడు,
నీ పెదవిపై ఓచిరునవ్వు విరబూస్తే చాలు
విరుచుకుపడే హోరుగాలిని ఆపినట్లే,
విజృంభించే అగ్నిపర్వతంపై
మంచు బిందువులు కురిసినట్లే,
చీకటిని చీల్చే వెచ్చని వెన్నెల
సౌహార్ద్రపు వెలుగుల్ని నింపినట్లే
ఒక చిరునవ్వు...
చిగురించే మొక్కకు తొలకరి జల్లు
వికసించే తామర పువ్వుకు చినుకుతడి
ఎర్రని ఎండలో చల్లని నీడ...
చీకటిని చీల్చే చిరుదివ్వే...
ఆ చిరునవ్వే...
ఒక్కసారి నవ్వి చూడు...నేస్తమా...
ఒక చిన్న నిప్పురవ్వ...
కారడవిని కాల్చి వేసినట్లు...
ఒక చిన్న రంధ్రం...
భారీ ఓడనే నీట ముంచేసినట్లు...
ఒక చిన్నచిరునవ్వు చిమ్మచీకట్లను
చీల్చి వెన్నెల వెలుగులు పంచుతుంది
అర్థరాత్రిలో సూర్యోదయాన్ని సృష్టిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి