సుప్రభాత కవిత : - బృంద
అసమాన అభిమానాలొద్దు 
ఆత్మీయ పలకరింపు చాలు!
అనుంగు తోబుట్టువులొద్దు 
అక్కరకు తోడుంటే చాలు!

ఆప్యాయతలు కుమ్మరించక్కర్లేదు 
ఆక్షేపణలు లేకపోతే  చాలు!
ఆదరించి ఆదుకోనక్కరలేదు 
ఆడుకోకుంటే అంతే చాలు!

ఇంద్రధనసు మెరుపులొద్దు 
ఇంటిలో చిన్న వెలుగు చాలు!
ఇంతలేసి వరాలొద్దు 
ఇంగితాన నడవనిస్తే చాలు!

ఈసు అసూయల చెలిమి వద్దు 
ఈశ్వరుడి పై నమ్మకముంటే చాలు!
ఈదురుగాలులెదురైనా 
ఈడ్చుకుపోలేని అనుగ్రహం చాలు!

ఉసిగొలిపే కోరికలొద్దు 
ఉసురు పోసుకోక ఉంటే చాలు!
ఉసిరంత మంచి చేయకపోయినా
ఉడత సాయం చేయగలిగితే చాలు!

ఊరికంతా మంచి చేయొద్దు 
ఊరుకున్నా చాలు!
ఊసుపోక చెప్పే కబురులొద్దు
ఊరటగా ఒక్క మాట చాలు!

ఋణానుబంధాలను గౌరవించి 
ఋషిలా కాకపోయినా  మనిషిలా
ఋజుమార్గాన నడిపించమని
ఋతుకర్తను వేడుకుంటూ...

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు