సునంద భాషితం: - వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు -826
"ఉపదేశ్యానుపదేశత్వే విపరీతం బలమ్ న్యాయము
****
ఉపదేశ్యము అనగా ఉపదేశం లేదా బోధన అని అర్థము.ఇది గురువు లేదా ఆధ్యాత్మిక గురువు అందించే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం.
అనుపపదేశ్యం అనగా ఒక ఉపదేశము లేదా బోధన చేయకుండా ఉండటం.విపరీతం అనగా ఏదైనా విషయం, పని లేదా పరిస్థితి ఆ సాధారణం పరిమితిని మించి అతిగా లేదా సాధారణంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా విషయం హానికరంగా ఉన్నప్పటికీ ఉపయోగించే పదం.బలమ్ అనగా ఒక వస్తువులో త్వరణం కలిగించే ప్రభావం, ఒక వస్తువును కదపడానికి లేదా స్థితిని మార్చాడానికి ఉపయోగించే శక్తి.
ఉపదేశింప వలసిన వారికి తగిన ఉపదేశము చేయకపోతే విపరీతముగా పరిణమిస్తాడు.అప్పుడతడు బలవంతుడయినా కావచ్చు.లేదా బలహీనుడయినా కావచ్చును. ఉదాహరణకు ఆకాశము శబ్ధ గుణాత్మకము అని చెప్పి దాని యందు నీలత్వం ఉన్నదని చెప్పకపోతే ఆకాశము నీలముగా ఉండడము ప్రత్యక్షంగా కనబడుచుండటము చేత మొదటి ఉపదేశమునకు బాధ కలుగుచున్నది.
 ఉపదేశింప వలసిన వారు అంటే ఎవరో తెలుసుకుందాం.ఉపదేశం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే.ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు,గురువుల నుండి విద్యార్థులకు,పెద్దతరం వారి నుంచి నేటి తరం వారికి ఉపదేశం అవసరం.
ఎందుకు అంటే ఎవరైనా సరే జ్ఞానం పొందడానికి, సరైన మార్గదర్శనం కోసం, సన్మార్గంలో నడవడానికి, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మంచిదా కాదా అని సలహాలు సూచనలు పొందడానికి మరియు జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళను అధిగమించడానికి ఉపదేశం అనేది అవసరం.
ముఖ్యంగా జ్ఞానాన్ని అందించడానికి ఉపదేశం ఎంతో అవసరం.ఎందుకంటేఉపదేశం ద్వారా తెలియని ఎన్నో విషయాలను, నైపుణ్యాలను, ఆధ్యాత్మిక సంబంధమైన తత్వ విచారాలను, తార్కిక ఆలోచనలను, విమర్శనాత్మక పరిశీలన దృష్టిని అలవర్చుకోవడానికి ఉపదేశం లేదా బోధన అవసరమవుతుంది.
ఈ బోధన లేదా ఉపదేశం ద్వారా ఉపదేశం పొందాల్సిన వారు నైపుణ్యాలను మెరుగు పరచుకోవడంతో పాటు వారిలో వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది.భవిష్యత్తు దిశా నిర్దేశం కోసమే కాకుండా ఈ బోధన లేదా ఉపదేశం వల్ల సవాళ్ళను అలవోకగా ఎదుర్కోగలుగుతారు.
గురువులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక వాదులు, తాత్విక వేత్తలు ఇచ్చే ఉపదేశాల వలన విజ్ఞానంతో పాటు వివేకం,వివేచన కలుగుతాయి. సర్వతోముఖాభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి .
ఈవిధంగా బోధన లేదా ఉపదేశం అనేది ఒకరి నుంచి మరొకరికి అందించే ప్రక్రియ.ఇది విద్యార్థులు, ఏదైనా విషయ జ్ఞానం పొందాలనుకునే వారు. వివిధ రకాల వృత్తి, సృజనాత్మక నైపుణ్యాలు పొందాలని అనుకునే వారికి బోధన లేదా ఉపదేశం అవసరం అనేది ఈ "ఉపదేశ్యానుపదేశత్వే విపరీతం బలమ్ న్యాయము "ద్వారా మనం తెలుసుకోగలిగాము.
అందుకే మన పెద్దలు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు.
ఈ ప్రపంచంలో మన హితాన్ని కోరుకుంటూ మన అభివృద్ధికి బాటలు వేసే వారిలో ముఖ్యమైన వారు గురువులు మరియు గురు సమానమైన వారు ఉన్నారు . వారు జ్ఞానం, నైతికత మరియు జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే మార్గదర్శకులు.జీవన విలువలు నేర్పి ఆదర్శంగా నిలుస్తారు వీరు మనలో జ్ఞానజ్యోతిని వెలిగించి మంచి లక్షణాలు పెంచడంలో ముందుండే వారు  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,ప్రేరకులు, సమాజానికి సేవ చేస్తున్న సమాజ సేవకులు,పురాణగురువులు..వీరు తప్పకుండా ఉపదేశం ఇస్తారు.ఇవ్వాలి కూడా. అలాంటి గురువుల బోధన వల్లనే సమాజం విలువలతో కూడి ఉత్తమ సమాజంగా పేరుపొందుతుంది.

కామెంట్‌లు