ఓ నా ప్రియ మిత్రమా..!
పదే పదే...
నీవు పొగడ్తల వానలో
తడుస్తున్నావంటే…
అవగాహన కోల్పోయిన
ఆనంద నిమిషాలు నిన్ను
మాయ చేస్తున్నాయని అర్థం..!
విమర్శల మెరుపులకు నీవు
గజగజ వణుకిపోతున్నావంటే…
సైక్లోన్ లో హోరు గాలికి
విలవిలలాడే ఆకుగా మారినట్టేనని అర్థం.!
పదే పదే...
నీవు ఓ అమ్మాయిని
ప్రేమ పల్లకిలోకి
ఆహ్వానిస్తున్నావంటే..!
కొత్త కోరికల ఘుమఘుమలు
నిన్ను ఊరిస్తున్నాయని...అర్థం..!
ప్రేమనే పరిమళపు మొక్క
నీ హృదిలో మొలకెత్తిందని...
ఆమెను నీ గుండెగుడిలో ఒక
దేవతగా ప్రతిష్టించుకున్నావని...అర్థం..!
ఆమె తనువును...తనువులోని
అణువణువును తాకాలని
తపిస్తున్న "ఒక ప్రేమపిపాసివని"...అర్థం..!
పదే పదే...
నీవు వివాహపు విందులో
ఘుమఘుమలాడే
ప్రతి వంటకాన్ని
ఆశతో రుచిచూడాలని
ఉవ్విళ్లూరుతున్నావంటే
నీవు "ఒక బకాసురుడవని"...అర్థం..!
పదే పదే...
నీవు పనులుమాని పడకపై
వాలి గుడ్లగూబలా గురకలతో విరాజిల్లుతున్నావంటే…
నీవు రోజుని కలలదుప్పటి కప్పి నిద్రలో
ముంచే "ఒక సోమరిపోతువని"...అర్థం
పదే పదే...
నీవు శత్రువుల గురించి
ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే…
నీవు తాళం వేసి నీ జీవితాన్ని
వారి పాదాల కింద పెట్టేశావని ..!
నీ భయం నిన్నే
చుట్టేసిన ఒక "అనకొండని"...అర్థం..!
పదే పదే...
నీవు ఓటమిని గెలుపుగా
చూడాలని ప్రయత్నిస్తుంటే…
జ్ఞానాన్ని నీవు గెలుపుగా
స్వీకరిస్తున్నావని అర్థం..!
కాని నీవు ఓటమినే అభిమానిస్తే
అది విజయానికి తలుపులు
మూసే ఓ "మూఢనమ్మకమని" అర్థం..!
పదే పదే...
నీవు అందరినీ అర్థం
చేసుకుంటున్నావంటే…
నీవు నీ అవసరాలకు ఆపదలకు
ఆశల వలలు వేసేవాడివని అర్థం..!
నువ్వు వేదన తెలిసినవాడివైనా
దాన్ని మాటల్లో దాచేవాడివని అర్థం..!
పదే పదే...
నీవు పరులను పొగడ్తలతో
అలరిస్తున్నావంటే…
నీవు వారికో కట్టుబానిసవని అర్థం..!
వారి గర్వాన్ని గీతాలతో పూజిస్తున్నావంటే
నీ స్వాభిమానాన్ని అమ్ముకుంటున్నావని...అర్థం
పదే పదే...
నీవు ఒకరిని అకారణంగా
విమర్శిస్తున్నావంటే…! నీలోని
అసూయకు నీవే ప్రతిరూపమని అర్థం..!
నీడలకు భయపడే వ్యక్తిత్వంనీదని అర్థం.
పదే పదే...
నీవు పరుల బాధలపై
స్పందిస్తున్నావంటే..!
నీవు కన్నీటి వాకిలి దాటి
గుండెల తడిని గుర్తించే
ఒక ఆపద్బాంధవుడివని అర్థం..!
పదే పదే...
నీవు దైవాన్ని
ద్వేషిస్తున్నావంటే..!
పరుష పదజాలంతో
దూషిస్తున్నావంటే..!
ఆయన నీ సహనాన్ని
పరీక్షిస్తున్నాడనే అర్థం..!
ఒక్కోసారి ఆయన్ని ప్రేమించే...
కన్నీటితో ప్రార్థించే వారేకాదు
ప్రశ్నలు సంధించే వారు సైతం
ఆ దైవం కురిపించే వరాల వర్షానికి
ప్రీతిపాత్రులేనని గుర్తుంచుకో...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి