న్యాయములు -834
కష్టే ఫలమ్/కష్టే ఫలి న్యాయము
****
కష్టపడితేనే ఫలం/ఫలితం కలుగుతుంది/లభిస్తుంది అని అర్థము. అంటే ఏదైనా సాధించాలంటే ఏమాత్రం శ్రమించకుండా, ఎలాంటి కష్టం పడకుండా ఎలాంటి ఫలితం రాదు.అదే ఈ న్యాయములోని అంతరార్థము.
దీనినే "ఆంగ్లంలో నో పెయిన్స్,నో గెయిన్స్" అని అంటారు. కష్టాలు లేకపోతే లాభాలు ఉండవని భావన.
మరి ఈ కష్టే ఫలి లేదా కష్ట ఫలమ్ న్యాయము గురించి కొన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
మనం ఫలితం పొందాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది. ప్రయత్నించాల్సి వుంటుంది.అది పక్షయినా,పశువైనా ,మనిషైనా. అందుకే భర్తృహరి సుభాషితాలలో ఇలా అంటాడు.
"ప్రయత్నేన హి సిధ్యంతి కార్యాణి,నా మనోరథైః!/నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః"
అనగా దేనికైనా మానవ ప్రయత్నం చేయవలసిందే.నిద్రబోయే సింహం నోట్లోకి నేరుగా జంతువులు వచ్చి దూరిపోవు గదా!( కాబట్టి సింహం లేచి పరుగులు తీస్తూ వేటాడితేనే, దాని నోటికి ఆహారం అందుతుంది)చీమైనా వెతుక్కోవలసిందే.సింహమైనా వేటాడ వలసిందే కదా!.
కూలీ అయినా, విద్యార్థియైనా తాము సాధించాలనుకునే దాని కోసం తప్పకుండా కష్ట పడాలి. కొందరిది శారీరక కష్టం. మరికొందరిది మానసిక కష్టం. అంటే ఆలోచించి ఆలోచించి పని చేయడం. దీనికి ఉదాహరణగా థామస్ అల్వా ఎడిసన్ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 199సార్లు తాను చేస్తు పనిలో విఫలమైనా ప్రయత్నం చేసి చేసి విద్యుత్ బల్బు కనిపెట్టడం మామూలు విషయం కాదు.
దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథను కూడా చర్చించుకుందాం. ఒకానొక భక్తుడు ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు.అలా వెళ్తూ ఉంటే బండి బురద గుంటలో పడిపోతుంది. ఎంత తీద్దామని ప్రయత్నించినా అది రాదు. అప్పుడు ఆ భక్తుడు దైవాన్ని ప్రార్ధిస్తాడు . అయినా రాదు. మెల్లగా కిందికి దిగి బురద గుంటలోంచి బండి చక్రాన్ని వెనుక నుంచి గట్టిగా నెట్టడంతో బండి గుంట నుండి చక్రం బయటకు వస్తుంది. అప్పుడు ఆ భక్తుడు భగవంతుని గురించి ఓ సందేహం వస్తుంది. అసలు దేవుడున్నాడా? నేను ఆయనను అంతగా నమ్మి పూజిస్తున్నాను కదా! నాకింత కష్టం వస్తే సహాయం చేయనే లేదు అనుకున్నాడట. అప్పుడు ఆ దేవుడు " ఓ పిచ్చివాడా! నా సహాయం లేకుండానే బండి చక్రం బయటకు వచ్చిందని అనుకుంటున్నావా? నువ్వు నీ శక్తిని నమ్ముకుని ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెట్టావో అప్పుడే నా సహాయం అందించాను. గాలిలో దీపం వెలిగించి ఆరిపోకుండా ఆపమని అనడం కాదు. దానికి మీ చేతులు అడ్డం పెడితే నా చేయి కూడా అడ్డుకుంటుంది అన్నాడట ఆ భగవంతుడు. అంటే మనం కష్టిస్తేనే దైవ సహాయం తోడవుతుందనేది అర్థము ౙసుకోవచ్చు.
అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరకు రాయబారిగా వెళ్తూ అర్జునుడితో ఓ మాట ఇలా అంటాడు.
"వెరపున లావునం గృషికి వేయు విధంబుల మేలొనర్చినన్/దొరకొనునే ఫలంబు తరితో దగు వర్షము లేక యున్న?/నెప్పురుసున లెస్స సేసినను బౌరుషముల్ ఫలియించుటెల్ల నా!/దరణమునం బ్రసన్నమగు దైవము చేత న చూవె ఫల్గుణా!"
అనగా ఎంత కష్టపడి సేద్యం చేసినా, సకాలంలో వర్షాలు పడకపోతే అంతా వ్యర్థమే గదా!దైవానుకూల్యత లేకపోతే - మన శ్రమ ఫలింపుకు రాదు గదా! అన్న ఆ కృష్ణుడే " కావున సంధికిన్ పురుషాకార మొనర్చెద నోపినంతయున్/దైవము చేత యెట్లగునొ దాని నెరుంగను"అని కూడా అన్నాడాయన.
ఎప్పుడైనా సరే మనిషి తాను చేయవలసిన పనిని కష్టమని భావించకుండా సమగ్రంగా , సఫలం అవుతుందనే నమ్మకంతో చేయాలి.అలా చేసినప్పటికీ దైవానుగ్రహం కూడా తోడవ్వాలి అంటారు ఆధ్యాత్మిక వేత్తలు.
ఇక మన చిన్నప్పుడు చదువుకున్న చీమ - గొల్లభామ/ మిడత కథ అందరికీ తెలిసిందే. చీమ ఎండాకాలం అంతా కష్టపడి ఆహారం సంపాదించుకుని దాచుకుంటుంది. మిడత/ గొల్లభామ మాత్రం ఎండాకాలం అంతా హాయిగా,ఆనందంగా కాలం గడుపుతుంది. శీతాకాలం, వర్షాకాలం వచ్చినప్పుడు చీమ ఆహార సమస్య లేకుండా ఆనందంగా ఉంటుంది. మిడత/గొల్లభామ కష్టపడాల్సిన సమయంలో కష్టపడక పోవడంతో ఆకలికి అల్లాడి పోతుంది. కష్టించడం వల్ల చీమకు ఫలితం లభించిందని ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఇలా కష్టపడితేనే, కష్టపడిన వ్యక్తికే ఫలితం లభిస్తుంది. దైవ సహాయం కూడా లభిస్తుంది.లభించాలి కూడా.ఎందుకంటే అది న్యాయము కూడా.లభించకపోతే అది చాలా బాధాకరం. కొన్ని సందర్భాల్లో, కొందరి విషయంలో"కష్టమొకరిది ఫలితమొకరిది- నేటి సమాజంలో చూస్తున్నామిది."చీమలు పెట్టిన పుట్టలు/ పాముల కిరవైన యట్లు పామరుడు దగన్/హేమంబు గూడబెట్టిన/ భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!"
అనగా చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరినట్లు, పామరుడు కష్టపడి దాచుకున్న బంగారం రాజుల పాలై, అతడికి ఉపయోగపడకుండా పోతుంది.అలా జరుగకుండా చూడడం మన విధి. ఇదండీ "కష్టే ఫలి/ ఫలమ్" న్యాయము యొక్క విశేషాలు, ఇందులో మనకు మూడు కోణాలు కనిపిస్తున్నాయి. కష్టించినచో ఫలితం దక్కుతుందని.ఎంత కష్టించినా సహాయం దైవ రూపంలో అందితేనే ఫలితం దక్కుతుందని.కష్టించేవారు కొందరు వారికి ఆ ఫలం అందకుండా దోచుకునే వారు మరికొందరు అని.అయితే కష్టించిన వారు ఫలితాలు పొందేలా చూడటం మన వంతు కర్తవ్యం.ఏకీభవిస్తారు కదూ!.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి