న్యాయములు-825
తత్ప్రఖ్య న్యాయము
****
తత్ అనగా ఉన్న అని అర్థము.తత్ప్రఖ్య అనగా ఆ విధంగా స్పష్టమైనది,దర్శనీయము ,పోలునది, ఉన్నది అని అర్థము.
తత్ప్రఖ్య అంటే అనాదిగా వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలలో ఉన్న కొన్నింటిని గురించి స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరము వుందని అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెప్పడం జరిగింది.
అయితే ఈ "తత్ప్రఖ్య న్యాయము"ముఖ్యంగా అగ్నిహోత్రం, హవిస్సులను ఉద్దేశించి చెప్పబడింది.
అందుకే అగ్ని హోత్రం అంటే ఏమిటో? అది ఎందుకు చేయవలెను? ఒకవేళ చేయాలి అన్నప్పుడు వేటితో చేయాలి? అనే ప్రశ్నలు మనసులో ఉదయిస్తాయి. వాటిని గురించిన వివరాలు తెలుసుకుందాం.
అగ్ని హోత్రం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక భాగము. యజ్ఞ యాగాలు చేసేటప్పుడు,వివాహాది శుభకార్యాలలో పంచభూతాల్లో ఒకటైన అగ్నిని వెలిగించి,ఆ అగ్ని దేవుని సంతృప్తి పరచడానికి అగ్ని హోత్రం ఏర్పాటు చేస్తారు. హోత్రం అంటే హవిస్సు.అనగా హవిస్సు అనే పదము అగ్ని హోత్ర శబ్దము వలన మనకు తెలుస్తున్నది.
అసలు హవిస్సు అంటే ఏమిటో చూద్దాం. అగ్నిలో హుతం చేయబడే వస్తువులను హవిస్సులు అంటారు.అంటే అగ్నిలో భక్తి పూర్వకంగా,మంత్ర సహితంగా ఆయా దేవుళ్ళకు స్వాహా అంటూ అగ్నిలో హుతం చేసే ఆహార పదార్థాలు మరియు చెట్ల మూలికలు, వేర్లు, చెక్క ముక్కలు మొదలైనవి.
మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగానో,మరే విధంగానో నిత్యం కావాలని ఏ అగ్నికి యజ్ఞం చేయక పోయినా మన దేహంలోని అగ్నికి మాత్రం తప్పకుండా యజ్ఞం చేయాల్సిందే.దేహంలోని అగ్నా? మనకు తప్పకుండా సందేహం కలుగుతుంది.అదేనండీ! జఠరాగ్ని.అగ్ని లక్షణం ఒకటే అయినా అవి ఉండే స్థలాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు కదా! అవేమిటో తెలుసుకుందాం.
ఒకటి బడబాగ్ని:-ఇది సముద్రంలో వుంటుంది.దీనినే బ్రహ్మాగ్ని అనికూడా అంటారు.
రెండవది జఠరాగ్ని:- ఇది జీవుల ఉదరంలో ఉండి ఆహారమును జీర్ణింప జేస్తుంది.
మూడవది కాష్టాగ్ని లేదా దావాలనము:- ఇది ఎండు కఱ్ఱల రాపిడి వలన పుట్టి హోమములు మొదలగు వాటిని చేయడానికి ఉపయోగపడుతుంది.
నాల్గవది వజ్రాగ్ని:- ఇది ఇంద్రుని వజ్రాయుధంలో వుంటుంది.
ఐదవది సూర్యాగ్ని:- ఇది సూర్యుని నుండి వెలువడే అగ్ని.
ఇవే కాకుండా జ్ఞానం కోసం తపించే జ్ఞానాగ్ని,కడపులో రగిలే క్షుధాగ్ని,నేత్రాల నుండి వ్యక్తమయ్యే క్రోధాగ్ని, హృదయంలోంచి వెలువడే హృదయాగ్ని... ఇలా అనేక రకాల అగ్నులు మన మనశ్శరీరాలలో ఉన్నాయి. పురాణాలు చదివితే ఈ అగ్నుల గురించి సవివరంగా తెలుసుకోవచ్చు.
విషయానికి వద్దాం. యజ్ఞయాగాదుల్లో సమర్పించే హవిస్సుల గురించి మనందరికీ తెలుసు కాబట్టి ముఖ్యంగా మనం జఠరాగ్ని హోమం గురించి అందులో వేసే హవిస్సుల గురించి తెలుసుకుందాం.
మన పెద్దవాళ్ళు తరచుగా "ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు" అంటుంటారు కదా! మరి సాపాటు అంటే తమిళంలో"భోజనం" అని అర్థము.
ఏదీ చేయకుండా పనీ పాటా లేకుండా సోమరిగా కూర్చోవచ్చేమో కానీ జఠరాగ్నిని ఉపశమింప చేయక పోతే బతకలేము. బతికి బట్ట కట్టాలంటే "జఠరాగ్ని హోమం" నిత్యం చేయాల్సిందే.
అగ్ని అంటే జ్వాల, వేడి, వెలుగు.ఇవి సూర్యుని నుండి వెలువడే అగ్ని వల్ల మనకు లభ్యమవుతున్నాయి. ఈ అగ్ని వల్లే భూమి మీద మనమంతా జీవనం సాగిస్తున్నాం.ఈ అగ్నే దేహంలో చేరి వివిధ అగ్నులుగా మారింది. అందులో ముఖ్యమైనది . మనకు శక్తి బలాన్ని ఇచ్చేది జఠరాగ్ని.ఇది పొట్టలో/ ఉదరంలో పుడుతుంది. దీనిని వైశ్వానరాగ్ని అని కూడా అంటారు.
తినాలనే కోరిక కలిగి ,తింటేనే వచ్చే శక్తి,బలం ఈ జఠరాగ్ని వల్లనే వస్తుంది.
ఈ జఠరాగ్ని గురించి భగవద్గీతలో సైతం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది.
" అహ వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః/ప్రాణాపాన సమాయుక్తఃపచామ్యన్న చతుర్విధం"
అంటే దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య,భోజ్య,చోష్య,లేహ్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను" అంటాడు.అంటే జఠరాగ్ని భగవంతుని స్వరూపమని అర్థం చేసుకోవచ్చు.
మనం భుజించే ఆహారము ఆ భగవంతుడే మనకు ప్రసాదిస్తున్నాడు. ప్రసాదించిన ఆ ఆహారాన్ని వైశ్వానరుడనే జఠరాగ్నిగా మారి ప్రాణుల యొక్క శరీరములోని ప్రాణవాయువు సహాయంతో ఆహారమును నాలుగు విధములుగా పచనం చేయుచున్నాడు.
అందులో 1. భక్ష్యము అనగా కొరుక్కుని తినేది. 2.భోజ్యము అనగా మెత్తని చప్పరించి తినేది.3. లేహ్యము నాలుకతో రుచి చూసే పచ్చళ్ళు.4. చోష్యము - పాయసము లాంటివి. అందుకే "పచామ్యన్నం చతుర్విధం " అన్న శ్రీకృష్ణుడి మాటల ద్వారా మనకు పచనము కూడా భగవదనుగ్రహమే అని తెలుస్తోంది. మరి అలాంటి భగవదనుగ్రహము అయిన ఆహారాన్ని భగవంతునికి అర్పించిన అనంతరం తినాలని భగవద్భక్తులు చెబుతుంటారు.
సామాన్యులు సైతం జఠరాగ్ని విషయంలో ఓ మాట అనడం వింటుంటాం. "ఏ పూజ చేయకపోయినా పొట్ట పూజ తప్పకుండా చేయాల్సిందే". పొట్ట పూజ అంటే జఠరాగ్ని రూపమైన భగవంతుని పూజ అంటే ఆకలైనప్పుడు చేసే భోజనం అన్నమాట .
మరి ఈ మితంగా హితంగా చేసే భోజనం కూడా న్యాయార్జితమై వుండాలి. అప్పుడే భగవంతుని ఆశీస్సులతో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆనందాన్ని పొందగలం.
"తత్ప్రఖ్య న్యాయము" ద్వారా జఠరాగ్ని హోమం గురించి తెలుకోగలిగాం. న్యాయంగా సంపాదించిన డబ్బుతో తినే ఆహారం ఎంత తృప్తిని ఇస్తుందో మనందరికీ తెలిసిందే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి