ఉపాధ్యాయులం.
మేము ఉపాధ్యాయులం.
చిన్నారుల బంగరు భవితకు రంగులద్దే కార్మికులం
చిరుదివ్వెలయి వెలిగే చిరు బాలల ప్రతిభకు
మెరుగులద్దే శ్రామికులం
భావి భారత పౌరుల మనసున
జ్ఞాన బీజము నాటే హాలికులం
మంచి చెడులను, మనసు మమతను
విడమరిచి తెలిపే స్నేహితులం
అజ్ఞాన చీకటిని తరిమి
సుజ్ఞాన జ్యోతులు వెలిగించే
అక్షరార్చకులం
క్రమశిక్షణ ఉలిని పట్టి
మలిన శిలను తొలిచి పెట్టి
విద్యా శిల్పము చెక్కే
అక్షర శిల్పులం
అమ్మలా ప్రేమిస్తూ
నాన్నలా తోడవుతూ
నీడలా కాపాడే అక్షర వృక్షాలం
సతమతము చేసే సమస్యలెన్నున్నా
సహనముగ దాటే
చదువులమ్మ సేవకులం.
ఉపాధ్యాయులం
మేము ఉపాధ్యాయులం.
పెంకిగ మాట్లాడే పిల్లాడయినా
అరిచి గోల చేసే చిన్నోడయినా
మాట వినక
దారి తప్పిన
బాలలయినా
చదువు దరువుతొ
దరిని నడిచే చిన్నలయినా,
అందరినీ సమాదరించి,
ఉన్నతుల చేయడమే
మా లక్ష్యం .
విద్యా గంధమె మా ధ్యేయం
విద్యార్థి క్షేమమె
మా ధర్మం
విలువల సిరులే
మా గమ్యం.
విశ్వసించండి తల్లిదండ్రులారా!
అలుపెరుగని శ్రమగా సాగుతాం.
ఐక్యతగా నడుస్తాం
విద్యా సౌధం నిర్మిస్తాం.
మా,మీ,కలల సాగుకు కాపలాదారులమై
చదువుల పంటను రక్షిస్తాం
విద్యా ధనమును ఘనమైన నిధిగా అందిస్తాం.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై పయనిస్తాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి