వినోదం:- సరికొండ శ్రీనివాసరాజు

 వేసవి సెలవుల్లో అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ పల్లెటూరిలో వాళ్ళ తల్లి గారి ఇంటికి వాళ్ళ పిల్లలతో సహా చేరుకున్నారు. ఒకరోజు రాత్రి ఇంటి డాబా మీదకు అందరూ చేరుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు అవి శ్రద్ధగా వింటున్నారు. 
       "ఆ రోజుల్లో సెలవులకి ఇక్కడికి వస్తే అందరమూ ఒక గదిలో చేరుకొని రకరకాల ఆటలతో కాలక్షేపం చేసేవాళ్లం." అన్నది శ్రావణి. "పచ్చీసు, అష్టా చెమ్మ, క్యారమ్ బోర్డ్, దాడి ఇంకా ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో లెక్కలేదు." అన్నాడు వాసు. "ఇవేనా? ఇంకా రకరకాల వినోదాత్మక ఆటలు ఉండేవి."అంటూ అవి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ పడీ పడీ నవ్వింది శ్రుతి. ఆ ఆటలను ఎలా వినోదాత్మకంగా ఆడేవాళ్ళో తలచుకొని ఆపకుండా నవ్వుకుంటున్నారు అందరూ. "అంతేనా! కాలక్షేపం కోసం చందమామ, బాలజ్యోతి, చిన్న బొమ్మరిల్లు కథలు చదువుకునే వాళ్ళం." అన్నాడు రాజు. అంతేనా? మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఇంటి ముందుకు అమ్మడానికి వచ్చే తాటి ముంజలు, కొబ్బరి బోండాలు కొనుక్కొని తాగే వాళ్ళం." అన్నది సిరి. 
       "ఆ రోజులు జీవితంలో మళ్ళీ రావు. ఇప్పుడు సెలవుల్లో అమ్మమ్మల ఇళ్లకు చేరుకున్నారంటే మొబైల్ ఫోన్లకు అతుక్కొని ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పిచ్చి కాలక్షేపం. లేదూ టీవీలకు అతుక్కు పోయి, పిచ్చి ప్రొగ్రామ్స్ చూడటం ఇదే పని." అన్నాడు రాజేశ్. "వాళ్ళు చాలా చాలా ఆనందాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ భవిష్యత్ అంతా చీకటే." అన్నది శ్రావణి. 
       వింటున్న పిల్లల్లు ఆలోచిస్తున్నారు. తాము చాలా చాలా వేస్ట్ అనుకున్నారు. మరి వారి ఆలోచనల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. 

కామెంట్‌లు