న్యాయములు-828
"ఋణ వ్రణ కలంకానాం కాలే లోపో భవిష్యతి"న్యాయము
*****
ఋణం అనగా అప్పు.వ్రణం అనగా పుండు. కలంక అనగా నింద, మరక,మచ్చ,నలుపు గుర్తు,చెడ్డ పేరు.కాల అనగా నలుపు,సమయము,తగిన సమయము,అదను,ఋతువు, పరమాత్మ, భాగ్యము, కనుపాప,కోయిల,శని, శివుడు.లోపః అనగా తీసుకుని పోవుట,నాశము,తొలగించుట,అగపడకుండుటహింస విడిచి వేయుట.భవిష్యతి అనగా భవిష్యత్తు, రాబోయే కాలము, భవిష్యత్తులో జరుగబోయేది అని అర్థము.
అప్పు, పుండు,నింద ఇవి ఒకప్పుడు (తగిన కాలము వచ్చినప్పుడు) సమసిపోతాయి"అని అర్థము.
మప పెద్దవాళ్ళు తరచుగా "ఋణ శేషము,వ్రణ శేషము, శత్రు శేషము ఉండకూడదు" అనే సామెత చెబుతుంటారు.
ఋణము అంటే అప్పు, వ్రణము అంటే గాయము, నింద ఇవి మూడు కూడా ఒకే విధంగా బాధ పెడతాయి.నష్టాన్ని కలిగిస్తాయి.కష్టాలను తీసుకుని వస్తాయి. ఒకసారి అప్పు తీసుకుంటే అది మనసుకు అయిన గాయంలా తీరేదాకా భారమై వెంటాడుతూనే ఉంటుంది. అలాగే ఒంటిమీద అయిన గాయం కూడా తగ్గేంత వరకు సలుపుతూనే ఉంటుంది. ఇక నింద. నింద అంటేనే చేయని తప్పుకు అవమానం పొందడం, శిక్ష పడటం. అలాంటి నింద నిజం నిరూపితం అయ్యేంత వరకూ మనిషిని నిద్ర పోనీయదు.అవమాన భారంతో కృంగ తీస్తుంది. కాబట్టి ఈ మూడు మనిషికి మరణావస్థ వంటివి. ఇలాంటి వాటిని వెంటనే తీర్చేసుకోవాలి. పోగొట్టుకోవాలి.
ఋణ,వ్రణ,కలంకాలను వెంట వెంటనే తొలగించుకోక పోతే... అందులో ఋణ శేషము అంటే ఎవరికైనా బాకీ పడటం. తీసుకున్న అప్పు తిరిగి వెంటనే చెల్లించకుండా వుండిపోతే అది లోలోపల అగ్ని పర్వతంలా బాధ రగులుతూనే ఉంటుంది.ఆకాశమంత పెరుగుతూనే ఉంటుంది.అందుకే మన పెద్దలు ఋణ శేషము అస్సలు ఉంచుకోకూడదు అంటుంటారు.
ఇక వ్రణం . వ్రణం అంటే పుండు, గాయం. "నరం మీద పుండు నడమంత్రపు సిరి" మనిషిని నిలకడగా ఉండనీయవు అంటారు. పుండు సలుపుతూ, విపరీతంగా బాధ పెడుతుంది.కాబట్టి దానిని వెంటనే తగ్గించుకోవాలి.
ఇక కలంకం. కలంకం అంటే వ్యక్తికి వచ్చే చెడ్డ పేరు. ఒకోసారి వచ్చిన చెడ్డ పేరు మళ్ళీ పోదు అంటారు. నీలాపనిందలు అనగా మన ప్రమేయం అసలే లేకుండా వస్తుంటాయి. సాక్షాత్తూ శ్రీకృష్ణుడు అంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదు.కాబట్ఠీ దీనికి మనం మానసికంగా సిద్ధమై, ఎప్పటికైనా నిజం తెలుస్తుంది.అనే మనో స్థైర్యంతో ఉండాలి.అది తెలిసేలా చేయాలి .
దీనికి సంబంధించిన నరసింహ సుభాషితాన్ని చూద్దామా...
"ఋణ శేషోగ్ని శేషశ్చ శత్రుశేషస్త థైవ చ!/పునః పునః ప్రవర్ధన్తే తస్మాచ్ఛేషం న రక్షయేత్!!"
అనగా ఋణ శేషము, అగ్ని శేషము,శతృ శేషము ఉంచరాదు.అవి మరల మరల వృద్ధి పొందుతూ ఉంటాయి.అందు వల్ల వాటి యొక్క శేషాన్ని మిగల్చకూడదు.
అప్పు లేదా ఋణం తీసుకోవడం సహజమే.ఒకోసారి అవసరాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అప్పు/: ఋణము సరియైన కాల పరిమితిలో తీర్చి వేయడం విద్యుక్త ధర్మం.ఆ విధంగా తీర్చిన అప్పులో ఏ కొంచెం మిగిలి పోయినా అది కూడా ఇంతింతై అన్నట్టుగా పెరిగిపోతుందనేది అప్పు తీసుకున్న వ్యక్తులు గమనంలో పెట్టుకోవాలి.
అగ్ని శేషము కూడా అంతే. పూర్వము కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు. అయితే వంట పూర్తి చేసిన తర్వాత పొయ్యిలో మిగిలిన నిప్పు రవ్వలపై కానీ కట్టెలపై కానీ నీళ్ళు చల్లి సరిగా చల్లార్చకపోతే ఇ అగ్ని రవ్వలు రగిలి గాలికి ఎగిసి ఇళ్ళ మీద పడి ఇళ్లు కాలిపోయిన సందర్భాలు మనం చాలా సార్లు విన్నాం.అలాగే సిగరెట్ లాంటివి తాగి విసిరేసిన నిప్పుతో అడవులే కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నిప్పును శేషం లేకుండా పూర్తిగా చల్లార్చాలి.
ఇక శత్రు శేషము అంటే శత్రువులు లేకుండా వారిని చంపి వేయడం కాదు. వారితో ఉన్న వైరాన్ని పోయేలా చేసుకోవాలి.అంతే గానీ కత్తులు నూరుకునేలా ఉండకూడదు అని అర్థము.
విష్ణు శర్మ సంస్కృత భాషలో రచించిన పంచతంత్ర గ్రంథములోని "కాకోలూకీయం" అనే విభాగంలో కూడా ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ఓ శ్లోకం ఉంది.
"ఋణశేషాంచాగ్ని శేషం శత్రు శేషం చ!/వ్యాధి శేషంచ నిశ్శేషం కృత్వా ప్రాజ్ఞో న సీదతి!!
అనగా ఋణ శేషము, అగ్ని శేషము, శతృ శేషము, వ్యాధి శేషము అనే నాలుగు శేషాలు పోగొట్టుకుని జ్ఞాని అయిన వాడు దుఃఖాన్ని పొందడు ఆనందంగా ఉంటాడు అని భావము.
ఇలా ఇవన్నీ ఎంత త్వరగా శేషం లేకుండా కలంకంతో సహా ఎంత త్వరగా పోగొట్టుకుంటాడో, ఆ వ్యక్తి నిశ్చింతగా ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. ఏ ఒక్క దానిపట్ల అశ్రద్ధ వహించినా ఆయా వ్యక్తులు మానసిక ఒత్తిడి, శారీరక అనారోగ్యానికి గురి కాక తప్పదు.
కాబట్టి ఈ "ఋణ వ్రణ కలంకానాం కాలే లోపో భవిష్యతి" న్యాయము లోని అంతరార్థము గ్రహించి, తదనుగుణంగా జీవితాన్ని గడపాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి