గండం తప్పింది!!?:- డా ప్రతాప్ కౌటిళ్యా.
వాడు 
వేటగాడు కాదు. 
మృగాలతో స్నేహం చేస్తాడు.!

వాటిని ఆయుధాల కర్మాగారాలుగా 
తీర్చి దిద్దుతాడు.

రాత్రిపూట వాటితో
సర్కస్ నడుపుతాడు. 
పగటిపూట ప్రపంచ పంచాంగ 
పఠనం చేయిస్తాడు.!!?

ఆ తర్వాత 
ఒక పురోహితుని పిలిచి 
పిండం పెట్టి 
కాకులకు గద్దలకు వేయిస్తాడు.!!?

సముద్రాన్ని పగలగొట్టాలని 
కుట్రను కనిపెట్టిన సముద్రం 
గడ్డ కట్టింది.!!

మంచు పర్వతం కరుగలేదు 
పెరుగుతుంది.!! అందుకే 

జీవనదుల కదలికలు 
కనిపెట్టిన యుద్ధమేఘాలు 
లోయలు దద్దరిల్లేట్లు గర్జిస్తున్నాయి.!!?

గాయాన్ని మాన్పుతానని 
రక్త మంత్రాన్ని జపించి 

రక్షిస్తానని 
అక్కడి వృక్షాలను 
రక్తంతో పెంచుతున్నాడు.!!

కంచు మ్రోగినట్లు 
మంచును మోగించి 
ఆ కంచెనే ఆ చేనును మేస్తోంది.!!?

సాక్ష్యం చెప్పే వారంతా 
తెగిపడ్డ తెల్లని వెన్నెల చంద్రుల్లే!!

ఆకాశానికి గురిపెట్టిన అక్షం 
నక్షత్రాలను కాల్చింది. 
చీకటి గుండెల్లో గుండు దిగింది. 
సరిహద్దుకు గండం తప్పింది.!!?

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు