సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు -841
"కాలస్య కుటిలాగతః" న్యాయము
******
కాలస్య అనగా సమయము, కాలము.కుటిల అనగా వంకర,వంగి.ఆగతః అనగా వచ్చిన, ప్రవేశించిన అనే అర్థాలు ఉన్నాయి.
కాలము ఒక్కరీతిగా జరుగదు. సుఖము వెంట దుఃఖమూ, దుఃఖము వెంట సుఖము కలుగుతూ ఉంటాయి అనే అర్థంతో కూడినఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు
 కాలము యొక్క ప్రయాణము సరళంగా ఉండదు.అది ఎప్పుడూ ఒకే తీరుగా నిర్థిష్టమైన మార్గంలో నడవదు.ఇక్కడ వంకర లేదా వంగి అనగా ఇబ్బందికరంగా కూడా సాగిపోతుంది అని అర్థము.
 దీనికి ముఖ్యమైన ఉదాహరణగా కాల గతిలోని ఋతువుల గురించి చెప్పుకోవచ్చు. ఇవి ప్రకృతిలో ఎలాంటి మార్పులు తెస్తాయో మనందరికీ తెలుసు.ప్రతి ఋతువూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది.
వసంత ఋతువు వచ్చిందంటే చాలు. ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది.చెట్లు చిగిర్చి రకరకాల పూలతో  చూసేవారి మనసులను ఉల్లాసభరితం చేస్తాయి. చైత్ర, వైశాఖ మాసాలు రెండింటని కలిపి వసంత ఋతువు అంటాం.
ఇక గ్రీష్మ ఋతువు జ్యేష్ట, ఆషాఢ మాసాలను కలిపి గ్రీష్మ ఋతువు అంటాం. ఈ ఋతువు ఎండలు బాబోయ్ ఎండలు అని జనం  అల్లాడి పోయేలా చేస్తుంది.ఇవేం పట్టని పిల్లలకు వేసవి సెలవుల ఆనందం. పెద్దలకు ఈ కాలమొక పెద్ద పరీక్ష.
 మూడో ఋతువు వర్ష ఋతువు. శ్రావణ భాద్రపద మాసాల్లో వస్తుంది. తొలకరి జల్లుల తో అందరి మోముల్లో  ఆనందం .ఆ తర్వాత వర్షాలు రైతులకు హర్షాన్నిస్తే సామాన్యులకూ కొంత అసౌకర్యం కలిగిస్తాయి.
నాల్గో ఋతువు శరదృతువు.ఆశ్వయుజ , కార్తీక మాసాలు. శరత్కాల చంద్రుని వెన్నెలతో ప్రకృతి రమణీయంగా, కమనీయంగా ఉండి ప్రజల్లో ఎన్నో మంచి, దైవ భావనలను పెంచుతుంది.
ఐదో ఋతువు-మార్గశిర పుష్యమాసాలు. శీతాకాలం వస్తుంది చలి పులితో బెదిరిస్తూ, ముసలీ ముతకను అదరగొడుతూ దీర్ఘ రాత్రులు,కురచ పగళ్ళతో  కాలం సాగిపోతుంది.
శిశిర ఋతువు.ఇది మాఘం పాల్గుణ మాసాల్లో వస్తుంది. చెట్ల ఆకులు రాలిపోయి మోడులవుతాయి. చలి తగ్గి నెమ్మదిగా వేసవి కాలం మొదలవుతుంది.వాతావరణంలో తేమ తగ్గి వేడి పెరుగుతుంది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ప్రతి ఋతువు తన ఉనికిని చాటుకుంటూ కాలగతిలో అనేక మార్పులు తీసుకుని వస్తుంది.ఇలా కాలం ఒక్కరీతిగా జరుగదు.
కేవలం కాలమే అయితే ఆ మార్పులను మనం ఆనందంగా స్వీకరిస్తాం.దీనిని ఓ న్యాయముగా చెప్పుకోవలసిన అవసరం లేదు.కానీ మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితంలో కూడా అనేక మార్పులు వస్తుంటాయి.ఎవరి జీవితం మొత్తం సుఖంగా ఉండదు.దుఃఖాలు, బాధలు, వేదనలు వస్తుంటాయి.అలాగని మొత్తం దుఃఖమే ఉంటుందా అంటే ఉండదు.కొన్ని సంతోషాలు కూడా వచ్చి చేరుతాయి.
 దీనిని బట్టి  ఏదీ శాశ్వతంగా నిలువదు. మార్పులు వస్తుంటాయని మనం అర్థం చేసుకోవచ్చు.  దీనికి దగ్గరగా ఉన్న నార్ల వారి పద్యాన్ని ఒక సారి గుర్తు చేసుకుందాం.
"ఎండ వెనుకె వాన నిండు హర్షము నిచ్చు/రేయి వెనుకె పగలు హాయినిచ్చు/ బాధ వెనుకె సుఖము బహుళమై చెలగురా/ వాస్తవమ్ము నార్ల వారి మాట/"
అనగా ఎండాకాలం తర్వాత కురిసిన వర్షం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.రాత్రి తర్వాత వచ్చే పగలు కూడా హాయిని కలిగిస్తుంది.అలాగే కష్టాల తర్వాత వచ్చే సుఖం కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని ఈ పద్యం చెబుతోంది.
ఇదండీ!"కాలస్య కుటిలాగతః న్యాయము" యొక్క కథా కమామీషు. అందుకే మనమెప్పుడూ కష్టాలకు కృంగి పోవద్దు. సంతోషంతో పొంగి పోవద్దు. కాలంలో మార్పు వచ్ఛినా మనలో మార్పు రాకూడదు. అదే ఈ  న్యాయము లోని అంతరార్థం.అది తెలుసుకుని మసలుకుందాం.

కామెంట్‌లు