కనువిప్పు: సరికొండ శ్రీనివాసరాజు
 సిరిపురం ఉన్నత పాఠశాలలో భవ్య, నవ్య 8వ తరగతి చదువుతున్నారు. భవ్యకు ప్రతిరోజూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చే అలవాటు. ఆలస్యంగా నిద్ర లేవడం, సోమరిగా తయారు కావడం భవ్యకు  నిత్య కృత్యం. ప్రతిరోజూ క్లాస్ టీచరుతో తిట్లు తింటుంది. అయినా మార్పు లేదు. 
    నవ్య క్లాసు ఫస్ట్ వచ్చేది. ప్రతిరోజూ అరగంట ముందుగానే స్కూలుకు వచ్చేది. సమయం వృధా చేయకుండా చదువుకునేది. తాను ఒంటరిగా చదవకుండా సిరి, శివాని, వాగ్దేవి వంటి స్నేహితులను కలుపుకుని వారిని ప్రోత్సహిస్తూ కలసి చదివేది. నవ్యను అందరూ మెచ్చుకునే వారు. 
     ఒకరోజు భవ్య స్కూలుకు తొందరగా వచ్చింది. ఆ రోజే నవ్య ఆలస్యంగా వచ్చింది. క్లాస్ టీచర్ ఏమీ అనకుండా నవ్యను లోపలికి అనుమతి ఇచ్చింది. ఇది భవ్యకు నచ్చలేదు. "టీచర్! ప్రతీసారీ ఆలస్యంగా వచ్చినందుకు నన్ను బీభత్సంగా తిడతారు. ఈ రోజు నవ్యను ఏమీ అనరా?" అన్నది భవ్య. టీచర్ పట్టించుకోకుండా పాఠం చెబుతుంది. అయినా నస ఆపలేదు భావ్య. చివరకు టీచర్ భవ్యను తిట్టింది. భావ్య నవ్యను చాలా కోపంగా చూసింది. 
       ఇంటెర్వెల్లో నవ్య భవ్యను దగ్గరకు పిలిచింది. ఇలా అన్నది. "ఈరోజు నీ పుట్టిన రోజట . మీ అమ్మ చెప్పినా వినకుండా తొందరగా స్కూలికి వచ్చావట. మీ అమ్మ స్కూలికి బయలుదేరిన నన్ను ఆపి, తాను తయారు చేసిన సేమియా పంపింది. అందుకే నాకు స్కూలుకు ఆలస్యం అయ్యింది. హ్యాపీ బర్త్ డే టు యు." అంటూ సేమియా బాక్స్ తీసీ ఇచ్చింది. భవ్య కళ్ళలో కన్నీటి ప్రవాహం ఆపకుండా వస్తుంది. తనను క్షమించమని నవ్యను కోరింది. "ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్." అంటూ భవ్య చేతులు కలిపింది.

కామెంట్‌లు