సుప్రభాత కవిత : - బృంద
నా ధ్యేయం నీవే 
నా ధ్యానం నీవే
నా జీవం నీదే..
నా ప్రాణం నీకే......

గుండెలో దాచుకున్న
మొత్తం ప్రేమను
రెక్కలు ఒక్కొక్కటిగా విప్పి
నీకై పరిచాను....

నింగిలో నీ రూపు
నీటిలో చూస్తూ
నిండుగా ఎదలో నిన్నే నిలిపి
ఇంత  కాలం గడిపాను

నీ రాకకు నీరాజనమై 
వెలిగి మురిసిపోవాలని 
కలలు కన్న మనసు 
తనివి తీరగా వేచాను!

పొగమంచు ముసిరినా 
దిగివచ్చు నీ  ప్రభలు
నీ జాడ చూపించి
నా మనసు నింపేను!

నిన్ను చూచు నందాకా 
నీ కరుణ సోకునందాకా 
నా ప్రాణము నీ కొరకై 
తనువులోన నిలిపేను

కదిలివచ్చి కరువుతీరా 
కనిపించి కనికరించి 
కమలబాంధవుడన్న పేరు 
నిలబెట్టుకోమని.....

కమలము నివేదించిన
వేదన కనుగొని
కన్నులపండుగ తీరున
దర్శనమిచ్చిన  దినమణిని
స్వాగతిస్తూ

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు