అమ్మ పాదార్పితాలు!: - డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
(మాతృ దినోత్సవం సందర్భంగా) 
నా పంచపదుల సంఖ్య--- 
      1696 -1700.

1696.
కౌసల్య సుప్రజ శ్రీరామా,
దేవకి అష్టమ గర్భమా!

అంజనాదేవి తపో ఫలమా, భక్తాగ్రేసర హనుమా!

సిద్ధార్థ కన్న మహామాయా,
ఏసుక్రీస్తు మాతృ రత్నమా!

శివాజీ తల్లి జిజియాబాయి, మహాత్మ మాతృ దైవమా!

అవతార/ పుణ్య పురుషుల, జన్మ కారణం అమ్మేగా ,
 సివిఎల్!
1697
జగాన మానవ జీవన ,
ఉద్భవ మూలము జనని!

ప్రతిరోజు జీవన ఉత్సాహం, నింపే ప్రధమ పావని!

సరే ,నేడు ఏడాదికో రోజు, కేటాయించారు అవని! 

మాతృదేవోభవ నినాదం, వినిపించగా ప్రతిధ్వని! 

ఆరోజు ఎదురుచూపు ,
మన జీవన ఆనందగని, పివిఎల్! 
1698.
అమ్మ నేర్పిన మాటలు,
 ఎండని అమృతాల ఊటలు! 

అమ్మ చెప్పిన కథలన్నీ ,
నీతి గతి రాచ బాటలు!

అమ్మ పాడిన పాటలు ,
బతుకంతా కోయిల పాటలు! 

అమ్మ బోధన పెద్ద బాలశిక్ష, కట్టు జ్ఞానకోటలు! 

అమ్మ దీవెన శ్రీరామరక్త, 
దూరం చేయు అరిష్టాలు, పివిఎల్!
1699.
ఇలా నడయాడే ఆ బ్రహ్మ, జన్మనిచ్చిన మన అమ్మ! 

అమృత క్షీరం ఇచ్చి శిశువుని, పౌరుడ్ని చేయు అమ్మ! 

అనుక్షణం తన ప్రాణం పణం ,
పెట్టె త్యాగమూర్తి అమ్మ!

సంతానం కోసమే బతుకు, ముడుపు కడుతుంది అమ్మ! 

మహిలో మాతృ ఋణమే, తీర్చలేనిది తెలియుమమ్మా,
పివిఎల్!
1700.
అలనాటి శ్రావణకుమారుడివి, కాకున్నా చూడన్నా!

ప్రాణదానం చేసిన అమ్మకు, వాగ్దానం నీ ధర్మమన్నా!

అమ్మకువృద్ధాశ్రమంలేదు,
నాఇల్లే ఆశ్రమంఅంటున్నా!
అమ్మ ఉన్న గృహం ఇల ,
స్వర్గం, శ్రీనివాసం నిజమన్నా!

అమ్మకు నిత్య నమస్కారం, మన అత్యున్నత సంస్కారం, 
పివిఎల్!
________


కామెంట్‌లు