కొంగ- తాబేలు (గేయ కథ ):- ----- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
ఊరికి ఉత్తరాన ఉందొక చెరువు
చెరువు గట్టున  ఊడలమర్రి
కొమ్మల మీదనే కొంగల వాసం
చెరువు చేపలే వాటికి గ్రాసం

చెరువులోని కొంగల తోటి
తాబేలొకటి  సోపతి చేసే
కొన్నాళ్లకు ఎండలు మెరిసే
చెరువుల నీళ్లు ఇంకిపోయెను
చేపల సంఖ్య తగ్గిపోయేను

కొంగల కడుపు మాడ బట్టెను
మరో చెరువుకు చేరుకుందమని
తాబేలుతో బాస చేసేను
ఎగిరిపోవుటకు సిద్ధం అయిరి

రెక్కలు కలిగిన పక్షులు మీరు
ఎట్లైనను ఎగిరిపోదురు
మెల్లగా నడిచే తాబేలును 
మీతో వచ్చుట ఏల కుదురును

బాధతో అన్నది తాబేలు
అయ్యో అంటూ కొంగలు
యుక్తితో వెల్దుము మనమంతా
కొంగలు అన్నవి ఆప్యాయంగా

బకములు  రివ్వున ఎగిరినవి
అడవి అంతయు తిరిగినవి
కర్ర నొకటి చూచినవి
ముక్కున కరచుక తెచ్చినవి

గట్టిగా నోటితో కర్రను పట్టుము
  తుర్రున మేము కర్రతో లేతుము
  ఎగిరేటప్పుడు ఎవరేమన్నా
మాటలాడుట మంచిది కాదని
బుద్ధులు చెప్పి పైకి ఎగిరెను

చుక్కలు తాకే ఎత్తులో కొంగలు
రెక్కలు విప్పి ఎగురుతు ఉంటే
ఎన్నడు లేని వింతను చూసి
కేకలు వేసిరి కూతలు పెట్టిరి

ఇదేమి లీల? ఏడికి పోక
ఎన్నడు చూడని వింతను చూసి
  నేలన  పిల్లలు అల్లరి చేస్తూ
చప్పుడు చేసి చప్పట్లు కొట్టిరి

ఏమా లొల్లి? ఎందుకు చేసిరి?
ఎవరాపిల్లలు? ఏమిటి గొడవలు?
కేకలు వేసే పిల్లల చూసి
ఎందుకు అనుచు తాబేలు
తన నోరును విప్పెను

ఇంకేమున్నది ఇంకేమున్నది
అవసరం లేని ముచ్చట చూసి
దబాలుమంటూ  నేలన రాలేను
ప్రాణం విడిచె ఆ తాబేలు..!

      

 

కామెంట్‌లు