తాబేలు డిప్పకి వైద్యం!:- ఎం. వి.ఉమాదేవి
 చిట్టిపొట్టి బాలల కథలు -2
===================
ప్రతీ రోజూ లాగే ఆ రాత్రి  రింకు, పింకు నిద్ర వచ్చేవరకూ  గిచ్చుకుంటూ గిల్లుకుంటూ కవ్వించుకుంటున్నారు. కాసేపు దిండ్లతో కొట్టుకోవడం కూడా అయింది. 
అంతలో నాన్నమ్మ వచ్చిందీ పడక గదిలోకి. "యింకా నిద్రపోలేదా రింకూ?" అంటూ.
"మాకు నిద్ర రావట్లేదూ , నువ్వు కతజెప్పు నానీ !" అన్నాడు పింకూ.
"అనగనగా ఓ చెఱువులో తాబేలు పిల్ల ఉంది. దానికి డిప్ప ఓ పక్క కొంచెం చిట్లి ఉంది. " కథ మొదలెట్టింది నాన్నమ్మ.
"అయ్యో! ఎందుకనీ నానీ? " 
పిoకూ ప్రశ్న.
" తాబేలు పిల్ల ఒడ్డున చేరి విశ్రాంతి తీసుకున్నపుడు ఎవరో అల్లరి పిల్లలు ఓ సారి దానిపై రాళ్ళు విసిరారు. వాటిలో ఓ కంకరరాయి ఉండి సూటిగా తగిలి చిట్లింది అన్నమాట!" అన్నది నాన్నమ్మ.

"అయ్యో రక్తం వచ్చిందా నానీ?" పిల్లలు ఆదుర్దాగా అడిగారు.
"అబ్బే! డిప్పకి ఒట్టి పెంకు మాత్రమే వుంటుంది. నొప్పి లేకున్నా... అది ఉంటేనే తాబేళ్లకి రక్షణ కవచంలా పనిచేస్తుంది. " చెప్పింది నాన్నమ్మ.
"ఆ డిప్పకి కాస్త అతుకు వేయటం కోసం తాబేలు పిల్ల చేపల్ని, కప్పల్ని, పీతల్ని అడిగింది. కానీ అవి మేం యేమీ చేయలేం అన్నాయీ. !"
"అప్పుడు ఎవరు బాగుచేసేరు?" రింకూ అడిగాడు.
"ఉండు నాన్నా చెప్తా విను. బాతుల్ని అడిగినప్పుడు అవి ఓ విషయం చెప్పేసి వెళ్లాయి. నీటిలో ఉండే ఆల్చిప్పలలోపల ఉండే నత్తగుల్లలకి చెప్తే వైద్యం చేస్తాయి అనీ! " అని చెప్పింది నానీ.
" బాగుంది! మరి నత్తగుల్లలేమన్నాయి?" పింకూ అడిగాడు.
అవేమో " మాకు ఏదైనా క్రొత్తవస్తువు తగిలితే మా నుండీ ఒక ద్రవం వస్తుంది. అది ఆ రేణువు చుట్టు గట్టిగా తయారవుతుంది. దాన్నే ముత్యం అంటారు ఆ ద్రవం నీకు ఇస్తాం. నీ డిప్ప మీద పూసుకుంటే గట్టిగా మారి పగులు పూడిపోతుంది " అన్నదొక నత్తగుల్ల. 
"అయితే సరే!" అందీ తాబేలు పిల్ల. 
"మరి తాబేలుకి ఎవరూ మందు పూసేదీ? అది వీపుపై పూసుకోలేదుగా?" సందేహంగా అడిగాడు రింకూ. 
" అదే చెప్తున్నా! రెల్లు గడ్డి పొదల్లో కుంచెల్లా ఉండే రెల్లు పూలు మేం పూస్తాము అని హమీ ఇచ్చాయి. అట్లా తాబేలు పిల్ల ఆ జిగురు పూయించుకున్నాకా డిప్ప పగులు పూడిపొయింది! జలచరాలన్నీ రెల్లుపూలకి కృతజ్ఞతలు తెలిపాయి." అన్నది నాన్నమ్మ. 
"చాలా బాగుంది!" అంటూ పిల్లలిద్దరూ  ఆవలించి నిద్ర పోయారు!!

కామెంట్‌లు