వృద్ధాప్యం ఒక వరమా? ఒక శాపమా?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
నిన్నటి తరాలు చెప్పిన మాట
"ఆలస్యం అమృతం...విషమని"
"కాలాన్నే నమ్మితే చేటని...

నేటి తరమంటుంది
"వృద్ధాప్యం ఒక వరం...ఒక శాపమని"
"అది గతకర్మ ప్రతిఫలమని"...

నిన్నటి తరం అంది...
తల్లిదండ్రులంటే..?
దేవతలని...పంచభూతాలని...
ఆకాశ దీపాలని...ప్రత్యక్ష దైవాలని...
ఇంటికి కంటికి వెలుగు రేఖలని...

నేటి తరం అంటుంది...
కరుణ ప్రేమలేని...
దయా దాక్షిణ్యంలేని...
పాషాణ హృదయులైన...
కఠినాత్ములైన కొందరు కన్నబిడ్డలు
ఆ అనురాగ దీపాలనే ఆర్పేస్తున్నారని...

కోట్ల ఆస్తులు పంచినా
ఇంత ప్రేమను పంచలేని
పిల్లలచేతిలో తల్లిదండ్రులు
వాడిన పుష్పాలౌతున్నారు
రెక్కలు విరిగిన పక్షులౌతున్నారు
ఆశలకొమ్మలు తెగిన వృక్షాలౌతున్నారు
అనాధాశ్రమాల
అలల సముద్రాల్లో ఈదుతున్నారు...
వృద్ధులు ఆకలికి
అలమటించే అస్థిపంజరాలౌతున్నారు...
నిజంగా..."ఆ వృద్ధాప్యం" ఒక శాపమే...

కానీ కొంతమంది విజ్ఞతగల
వినయ సంపన్నులైన పిల్లలు
తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి
కార్చేకన్నీటి చుక్కల్ని తమ
అమృతహస్తాలతో తుడిచి...
ప్రేమతో చిరునవ్వుతో పలకరించి..
ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని...
కన్నుమూస్తే ఆత్మార్పణతో ప్రేమతో వారి 
చివరి కలల్ని పూలరథాల్లో ఊరేగిస్తారు

పాలరాతి సమాధులు నిర్మించి...
శిలలమీద చెక్కిన శిల్పాల్లా స్మరిస్తారు

వారి జ్ఞాపకార్థం సంస్మరణ దినాల్లో
అన్నదానాలతో...ఎన్ని జన్మలెత్తినా 
తీర్చలేని తల్లిదండ్రుల ఋణాన్ని
క్షణక్షణం గుర్తు చేసుకునే...పిల్లలున్న
ఆ వృద్దులు ఎంతటి అదృష్టవంతులు...?
ఆ "వృద్దాప్యమే కదా ఒక వరం"

అట్టి పుత్రుల జన్మధన్యమే..!
వారే ఆదర్శమూర్తులు ...
వారే స్పూర్తి ప్రదాతలు....
వారే ప్రపంచానికి మార్గదర్శకులు ..!


కామెంట్‌లు