కవిరత్న సాహిత్యధీర సహస్ర కవిభూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
అనుదిన పరమేశ్వర ప్రార్థన..!
( భక్తిరస భరితం...శక్తి పూరితం..)

శంకరా నాద శరీరాపరా..!
వేదవిహారా హరా జీవేశ్వరా..! అని
ప్రభాతవేళ పరమేశ్వర గీతం 
వీనుల విందుగా వినిపించు వేళ...
కోవెల గంటలు గణగణ మ్రోగే వేళ...

ఓం నమఃశ్శివాయ...
ఓం శంభో శంకరా...
ఓం హరహర మహాదేవా...! అంటూ 
వేడుకుందాం...కోరుకుందాం... 
స్మరించుకుందాం...శివున్ని శిరసువంచి...
చేతులు జోడించి...భక్తితో ప్రార్థిద్దాం ఇలా..

ఓ పరమాత్మా..! ఓ పరంధామా..!
బ్రహ్మముహూర్తపు 
బంగారు వెలుతురుని
మా నేత్రాల చెలిమిగా చేసి
అజ్ఞానాంధకారాన్ని తొలగించి మాలో విజ్ఞానజ్యోతిని వెలిగించుము తండ్రీ..!
ప్రతిఉదయం నీ ధ్యానమే 
మా మొదటి శ్వాస కావాలి తండ్రీ..!

ఓ ఈశ్వరా..! ఓ పరమేశ్వరా..!!
సుఖదుఃఖాల సునామీలు 
ముంచి వేయకుండా... 
సమస్యల విషసర్పాలు 
చాటుమాటుగా కాటు వేయకుండా...
మీ కరుణా కవచంతో 
మమ్ముల్ని రక్షించుము తండ్రీ..!

ఓ సర్వేశ్వరా..! ఓ జగదీశ్వరా..!!
ఈ భూగోళం లోని 
ఇంద్రియ భోగాల పైన...  
విషయ వాంఛల పైన... 
మాకు వైరాగ్యాన్ని కలిగించి...
మా హృదయాలలో నీ దివ్యజ్యోతి
నిత్యం వెలుగుతూ ఉండేలా...
నీ భక్తిస్వరూపాన్ని మాలో 
ప్రతిష్టింపజేయుము తండ్రీ..!

ఓ శంకరా..! ఓ భయంకరా..!!
ఆత్మవంచన పరనిందలకు దూరంగా
ప్రేమ కరుణ త్యాగమయమైన
విశాలహృదయాన్ని మాకు ప్రసాదించి...
జీవించిన ప్రతిక్షణం దివ్యత్వంతో నిండి
ఉండాలని మమ్మాశీర్వదించుము తండ్రీ..!

హే దీనబంధో..! ఓ ప్రేమైకసింధో..!!
త్రికరణ శుద్ధితో జీవించేలా...ఘోర
పాపాల నరకకూపాల నుండి మమ్ము 
విడిపించి కరుణించి కాపాడుము తండ్రీ..!

ఓ జ్ఞానేశ్వరా..! ఓ ప్రాణేశ్వరా..!!
కీర్తికిరీటాల మాయకు భ్రమింపక...
పేరుప్రతిష్ఠలపై ధనధాన్యాలపై ఆశ...
భోగభాగ్యాలపై ఆకర్షణ లేకుండా...
శుద్ధబుద్ధి, శాంతిమయమైన మనసుతో
నీవే మాలక్ష్యంగా బ్రతికే శక్తిని 
మాకు దయచేయుము తండ్రీ..!

ఓ సర్వాంతర్యామి..! ఓ సదానందా..!!
కులాల కతీతంగా రాగద్వేష రహితంగా...
ప్రతీప్రాణికి ప్రేమామృతాన్ని పంచేలా 
కరుణ జాలి దయ సమృద్ధిగా మా 
ఎదలో పావనగంగలా ప్రవహించునట్లు...
నీ అనుగ్రహాన్ని మాకందించుము తండ్రీ..!

ఓ అఖిలాండనాయకా..!
ఓ ఆనంద స్వరూపా..!!
దూషణ...భూషణలపై స్పందించని...
అసూయ పగా ప్రతీకారాలతో రగిలిపోని...
మంచుబిందువుల మానససరోవరాలుగా
మా హృదయాలను మార్చండి తండ్రీ..!

ఓ పార్వతీ ప్రాణనాథా..!
ఓ గంగాధరా..! ఓ జటాఝూటధారీ..!!
మా చిట్టచివరి శ్వాస వరకు...
నీ నామస్మరణే మా ఊపిరిగా ఉండాలని
నీ దివ్యరూపం మేధోనేత్రంలో నిలవాలని
ఆ మహాభాగ్యాన్నిచ్చే నీ అనుగ్రహాన్ని కోటిఆశలతో కోరుకుంటున్నాం తండ్రీ..!

ఓం శంభో శంకరా..!
ఓం హరహర మహాదేవ..!
ఓం నమఃశ్శివాయ..ఓం నమఃశ్శివాయ..!



కామెంట్‌లు