కన్నీటి చుక్క:- పైడి రాజ్యలక్ష్మి
 మనస్సనే వూట బావి నుండి ఎగసి
హృదయ కెరటాలను దాటీ
కంటిరెప్ప గడప దాటీ
జాలువారే కన్నీటి చుక్క,
చెంప తడిపి తిరిగి గుండె పైనే పడి
హృదయాన్ని తాకుతుంది!
కానీ… అది చేసే అలజడి
గుండె లోతులనుండి
జ్ఞాపకాల పొరలలో ఇమిడి ఉన్న
ఒక్కొక్క పొర… ఒక్కొక్క తరంగమై
ఉబికి… ఉబికి పొంగుకొస్తుంటాయి!
బాల్య, కౌమార్య, యవ్వన
వృద్ధాప్య దశల పరంపరలో
బంధాలు… బాంధవ్యాలు
బిడ్డలు… స్నేహాలు…సుఖాలు… దుఃఖాలు
ఆనందాలన్నిటినీ అనుభవించి
వాటిని చవి చూసిన మనిషి అంతరంగం
మాయ అనే జీవిత నాటకరంగంలో
నేనొక పాత్రధారిని అని తెలుసుకునేసరికి
నాటకం చివరి పేజీ వచ్చేస్తుంది!
అక్కడ నుండి వెనుతిరిగి చూస్తే…
సరిదిద్దుకోలేని జీవితం.
అప్పుడు వచ్చే కన్నీటి చుక్క
కంటి రెప్ప గడపలోనే ఇంకిపోతుంది.
——————————————

కామెంట్‌లు