నందిని చదువులో చాలా వెనుకబడి ఉండేది. టీవీ పిచ్చి, సెల్ ఫోన్లతో కాలక్షేపం ఇదే నందిని నిత్య కృత్యం. ఇంటివద్ద అసలే చదవదు. రాత పనులు అస్సలు చేయదు. నందిని స్నేహితులు నలుగురు చదువులో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి చదివేవారు. అయినా నందినికి చదువుకోవాలనే ఆలోచన ఎప్పుడూ రాదు. ఇంటి వద్ద తల్లితండ్రుల అతి గారాబం నందినిని చెడగొడుతుంది.
ఒకరోజు నందిని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. దారిలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ ఒకతను వెళ్తున్నాడు. నందినికి రోజూ ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. కానీ డబ్బులు లేవు. నందిని అతడిని ఆపి, "నాకు ఐస్ క్రీమ్ కావాలి అంకుల్! నా దగ్గర డబ్బులు లేవు. నా పుస్తకాల సంచి తీసుకోండి అంకుల్! బదులుగా నాకు 4 రోజులు ఐస్ క్రీమ్ ఇవ్వాలి." అన్నది. "నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?" అని అడిగాడు. "8వ తరగతి." అని చెప్పింది నందిని. ఆ పుస్తకాల సంచి తీసుకొని 4 రోజులు కాదు, రోజూ పిలిచి మరీ 15 రోజులు ఐస్ క్రీమ్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయింది నందిని.
ఆ సంవత్సరం గడిచింది. వేసవి సెలవలు వచ్చాయి. ఒకరోజు ఐస్ క్రీమ్ అతను నందినికి కనిపించాడు. 'చాలా థాంక్స్ అంకుల్!" అన్నది నందిని. "నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నీకే తల్లీ!" అన్నాడు అతను. ఆశ్చర్యపోయింది నందిని. మా అమ్మాయి కూడా 8వ తరగతి. మా అమ్మాయి పుస్తకాల సంచి మాయం అయ్యింది. గిట్టని వాళ్లు ఎవరు మాయం చేసారో తెలియదు. మేము చాలా పేదవాళ్ళం. మా అమ్మాయి తోటి స్నేహితుల పుస్తకాల సహాయంతో చదువుకుంటూ ఉంది. కానీ వాళ్ళ అవసరాలు పక్కన పెట్టి, ఎన్నాళ్ళు ఇస్తారు చెప్పు. ఇంతలో చిన్నారి దేవతలా నువ్వు కనిపించావు. ఐస్ క్రీమ్ కోసం నీ పుస్తకాల సంచి ఇచ్చావు. మా అమ్మాయి మరింత పట్టుదలతో చదివి బెస్ట్ మార్కులు సాధించింది. మెనీ మెనీ థాంక్స్." అన్నాడు ఐస్ క్రీమ్ అతను.
సిగ్గుతో తల దించుకున్నది నందిని. తల్లిదండ్రులు అన్నీ అమర్చి పెడుతుంటే కొండంత నిర్లక్ష్యం తనకు. ఏమీ లేని వారికి తెలుస్తుంది వాటి విలువ. అనుకుంది నందిని. కనువిప్పు కలిగింది. ఇక నుంచి కష్టపడి చదవాలి అనుకుంది నందిని. "మీ ఆమ్మాయి పేరు చెప్పండి అంకుల్." అన్నది నందిని.
"శ్రుతి" అని చెప్పాడు. "శ్రుతికి థాంక్స్ చెప్పండి అంకుల్." అని అక్కడి నుంచి తుర్రుమని జారుకున్నది నందిని.
పుస్తకాల విలువ : - సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి