హోమ్ వర్క్!!:- - ఎం. వి.ఉమాదేవి
 టీకూ(ధీరజ్), బాబీ (మానస్) మంచి మిత్రులు. కలిసే స్కూల్ కి వెళ్లి వస్తారు. కలసి ఆడుకుంటారు. ఎదురెదురు ప్లాట్స్ కావడంతో ఒకో సారి కలిసే భోజనం కూడా చేస్తారు.
మానస్ ఇంటికి రాగానే ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని, తల్లి ఇచ్చిన అల్పాహారం తినేసి హోమ్ వర్క్ చేసుకొని తర్వాత ఆటలకి పోతాడు. టీకూ ఒకో సారి బద్ధకంతో హోం వర్కు చేయకుండా ఆటలకి పోతాడు . మళ్ళీ ఉదయం లేవగానే, హోం వర్కు చేసే సమయంలేక అలాగే వెళ్ళి పోయి , టీచర్తో చీవాట్లు తింటూ ఉంటాడు. 
ఓ రోజున టీచర్ నోట్స్ లో మీ అబ్బాయి హోం వర్కు చేయకుండా వస్తున్నాడు అని వ్రాసి పంపింది. నాలుగు రోజుల హోం వర్కు అలాగే ఉంది. దాన్ని పూర్తి చేసిన తర్వాతనే స్కూల్ కి పంపమని
టీచర్ టీకు తల్లికి ఫోన్లో హెచ్చరిక చేశారు.
దాంతో మానస్ తమ ఇంటికి వచ్చాక డాబా మీదికి స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, స్నాక్స్ తీసుకొని వెళ్ళే వాడు. అక్కడ సాయత్రం కొబ్బరి చెట్ల నీడ, చల్లని గాలి బాగుండేది.
 "ఒరే బాబీ. నువ్వు హోం వర్కు చేసేవుగా. నాది కూడా కొంచం చెయ్యవా!? ప్లీజ్. తలనొప్పి వస్తుంది "అని మానస్ ని
అడిగేవాడు. 
దాంతో మానస్ పోనీలే పాపం అని రాసిచ్చాక, అదే టీచర్స్ కి చూపేవాడు. కొన్నాళ్ళు అలా సాగింది. 
చివరకి ఓ రోజున క్లాసులో తెలుగు టీచర్ టీకూ నోట్స్ లో చేతి వ్రాత చాలా గుండ్రంగా చక్కగా ఉంది ఏమిటీ అని అనుమానం వచ్చి, "ధీరజ్! నీ క్లాస్ వర్కు బుక్ ఇలా పట్రా."
అని పిలిచింది.
వాడు బుక్ ఇచ్చాడు. దాన్లో కోళ్లు కెలికినట్టున్న ధీరజ్ సొంత వ్రాత చూసి,
"నిజం చెప్పు. హోమ్ వర్క్ ఎవరు చేసారు?" అని గట్టిగా అడిగేసరికి భయపడి "మానస్ రాసిచ్చాడు మేడం!" అని చెప్పేశాడు.
దాంతో కోపంతో టీచర్ ఇద్దర్నీ మందలించి, i
"ఇది చాలా తప్పు. విద్యార్థికి చెప్పిన సబ్జెక్ట్ మీద బాగా పట్టు ఉండాలని హోం వర్కు ఇస్తాము. దాన్ని వాళ్ళే చేయాలి. అందువల్ల వారికి బాగా గుర్తు పెట్టుకోవడం అలవాటయి పరీక్షల్లో సరైన జవాబు ఇస్తారు. పేరెంట్స్ నో, ఇతరులు ఆ హోo వర్కు చేస్తే వీరికి ఎలా వస్తుంది? కాబట్టి ఇక మీదట ఇలాంటి పన్లు చేస్తే , ఇద్దరికీ టిసి ఇచ్చి పంపుతాము." అని చెప్పింది.
దాంతో ఇద్దరూ " క్షమించండి మేడం! ఇక ఎప్పుడూ అలా జరగదు!" అని చెంపలేసుకున్నారు. 
టీచర్ ఈ విషయాన్ని పెరెంట్స్ దృష్టిలోకి కూడా తీసుకోని వెళ్ళారు. "పిల్లలు ఇంటి పని బుక్ లో చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. ఏదో రా సుకుంటార్లే అని వదిలేస్తే ఇలా వేరే వారితో చేయిస్తారు. దాని వల్ల మీ అబ్బాయికి చాలా నష్టం!" అని చెప్పింది. వాళ్లకి కూడా చురుకు పుట్టి క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటన వల్ల మిగతా విద్యార్థులలో కూడా క్రమశిక్షణ అలవాటయింది!!


(సమాప్తం)

కామెంట్‌లు