సుప్రభాత కవిత : - బృంద

ఆరాటం ఎక్కువై అల్లుకుపోయినా 
వెనక్కు లాగే కడలి చేతిలో
కీలుబొమ్మ అయిన కెరటపు
పోరాటానిదెంత పంతం?

అందుకోలేకపోయానన్న కసితో
మరింత వేగంగా వచ్చినా
అసలు ఆగనివ్వని తీరపువాలు
తీరు ఎంత చిత్రం!?


మనసును మరిగించే తలపులను
కొంచెం కరిగించే పిలుపులు 
మమతను పెంచే వీలున్నా 
కలవనివ్వని కలవరాలదెంత
కరకుతనం?


వేసవిలో కురిసే వర్షంలా 
వెన్నెల్లో విరిసే మల్లియల్లా 
కన్నుల్లో మెరిసే మెరుపులు 
తెలియనివ్వని  దూరాలదెంత
కాఠిన్యం?

తొంగి చూసే నీలి నింగికి 
బెంగ తీరక నిలిచి చూస్తుంటే 
ఎగసి పడే అలల యత్నం
తెగి పడిపోతుంటే  ఎంత కష్టం!

సహజమైన విషయాలను
సమస్యలుగా  భావిస్తూ
సతమతమయ్యే మనసులకు
సతతమూ తోడుండే దైవానిదెంత
కరుణ?

కలతలకు నడతలకు 
మమకారాలకు  అహంకారాలకు 
సహనాలకు హావనాలకు 
సాక్షిగా ఉంటూ చక్రం తిప్పే
కర్మసాక్షికి...

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు