విద్యార్థి ఎలా ఉండాలి...:- - యామిజాల జగదీశ్
 సోక్రటీస్ ( క్రీ.పూ 470 - క్రీ.పూ 399) గ్రీకు తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఆయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే బోధన అనేది మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనలను గట్టిపరిచేదిగా ఉండాలంటారు. ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రంపై బలమైన ముద్ర వేశారు. ముఖ్యంగా ప్లాటో, అరిస్టాటిల్ పై ఆయన ప్రభావం ఎంతతగానో ఉండేది. నీతి నియమాలు, తర్క శాస్త్రంలో ఆయన ఎనలేని కృషి చేశారు.
అటువంటి సోక్రటీస్ వద్దకు ఓరోజు ఓ విద్యార్థి వచ్చాడు.
“గురువుగారూ నమస్కారాలు. విద్యార్థి అనే వాడు ఎలా ఉండాలి” అని అడిగాడు ఆ యువకుడు.
సోక్రటీస్ “విద్యార్థి అనే వాడు కొంగలా ఉండాలి. కోడిలా ఉండాలి. ఉప్పులా ఉండాలి. నీలాగా ఉండాలి” అన్నారు.
విద్యార్థికి సోక్రటీస్ చెప్పింది అర్థం కాలేదు.
“కాస్తంత విడమరిచి చెప్తారా” అని అడిగాడు యువకుడు.
అలాగేనని సోక్రటీస్ చెప్పడం మొదలుపెట్టారు.
“కొంగ ఒంటి కాలితో ఎక్కువసేపు సహనంతో నిలుస్తుంది. చేపలు రావడంతోనే నేర్పుగా వాటిని పట్టుకుంటుంది. అలాగే ఓ విద్యార్థి సరైన అవకాశాల కోసం నిరీక్షించి అవి చెంతకు రాగానే అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలి. మనలోని ప్రతిభను ప్రదర్శించుకోవాలి...” అన్నారు సోక్రటీస్.
“మరి కోడిలా ఉండాలన్నారు అంటే ఏమిటర్థం” అని అడిగాడు యువకుడు.
“కోడేం చేస్తుంది....చెత్తనంతా కెలుకుతుంది. చెత్తా చెదారాన్నంతా తప్పించేసి తనకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకుని ఆకలి తీర్చుకుంటుంది. అలాగే విద్యార్థులుకూడా తమకెదురపడే చెడుని దూరం చేసి మంచిని మాత్రమే తీసుకోవాలి” అన్నారు సోక్రటీస్.
“ఇక ఉప్పులా ఉండాలన్నారు కదా అంటే...” అని యువకుడు ప్రశ్నించాడు.
“అవును....ఉప్పుని  ఏదైనా వంటకంతో కలిపినప్పటికీ అది అందులో ఉందన్న విషయాన్ని చెప్పొచ్చు. కానీ చేసిన వంటకంలో ఉప్పు కలిసిపోయిన తర్వాత ఆ ఉప్పు కంటికి కనిపిస్తందా కనిపించదు.....అలాగే విద్యార్థులు కూడా ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉండాలి....తన తర్వాత కూడా ఫలానాది అతనే చేశాడు అని చెప్పుకునేలా ఓ ముద్రంటూ వేసుకోగలగాలి” అన్నారు సోక్రటీస్.
“మీరన్నది బాగానే ఉంది...కానీ నాలాగా ఉండాలన్నారు అంటే ఏమిటర్థం...” అని యువకుడు అడిగాడు.
“విద్యార్థి అనే వాడు తనలో కలిగే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడకూడదు....సిగ్గు పడకూడదు....తమ గురువుగారిని అడిగి తెలుసుకోవాలి....” అని ఓ చిన్న నవ్వు నవ్వారు సోక్రటీస్.

కామెంట్‌లు