సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-861
"క్రియా సిద్ధి స్సత్త్వేభవతి మహతాం నోపకరణే న్యాయము"
****
క్రియా అనగా పని,శ్రమ,ఆధ్యాపనము, అభ్యాసము.సిద్ధి అనగా పొందడం .సత్త్వే  అనగా బలము, ఒక గుణము ,స్వచ్ఛత, స్వభావము,భవతి అనగా  అవతరించడం, ఉండటం,వ్యక్తి యొక్క ఉనికి.మహతాం అనగా గొప్పతనం ,ప్రశస్తి, మర్యాద,గౌరవము. నోపకరణే అనగా  పరికరాలు లేక, ఉపకరణాలు లేక, సాధనాలు లేక అనే అర్థాలు ఉన్నాయి.
గొప్పవారు గొప్ప పని చేయడానికి వారి మహాత్మ్యమే కారణమవుతుంది కానీ వారు ఉపయోగించే సాధనము కాదు.అగస్త్యుడు కుండలో పుట్టినాడు. ఎప్పుడూ లేళ్ళతో అడవులలో తిరిగాడు భూర్జ పత్రముల బట్టలు కట్టినాడు.దుంపలను తిని బ్రతికాడు. అయినా సముద్రమును దోసిటిలోకి తెచ్చుకుని త్రాగి వేసినాడు. మనకు ఇక్కడ కనిపించింది లేదా అనిపించింది ఎలా పుట్టాడు.ఎలా పెరిగాడు అన్నది కాదు .ఆయనలో ఎంత మహాత్మ్యం ఉంది అని కదా గుర్తించబడేది.గుర్తించేది అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు .
 ఇక అగస్త్యుడి విషయం వచ్చింది కాబట్టి.తన గురించి కొన్ని విశేషాలు, విషయాలు తెలుసుకుందాం.
అగస్త్యుడు గొప్ప మహర్షి, అద్భుతమైన జ్ఞానానికి,తపస్సుకు, గొప్ప శక్తులకు ప్రసిద్ధి చెందిన వాడు. అగస్త్యు మహర్షి ప్రస్తావన వేదాలలోని ఋగ్వేదంలోనూ, స్కంధ పురాణం,వరాహ పురాణం మొదలైన పురాణాలలో వస్తుంది.
 అగస్త్యుడు ఒకసారి సముద్రాన్ని తాగాల్సి వస్తుంది.మరి అందుకు గల కారణాలను చూద్దాం.
కృత యుగంలో వృతుని కాలంలో, చాలా శక్తివంతులైన రాక్షసుల సమూహము ఉండేది.వారిని కాలకేయులు అని పిలుస్తారు. వారు దేవతలను ఎంతగానో హింసిస్తూ ఉంటారు.అందుకే వృత్రుడిని మరియు అతని క్రింద ఉన్న అసురులను నాశనం చేయడానికి బ్రహ్మను వేడుకుంటారు.అప్పుడు బ్రహ్మ గొప్ప ఋషి అయిన దధీచి సహాయం తీసుకొమ్మని చెబుతాడు.వారి కోసమని దధీచి తన శరీరాన్ని త్యాగం చేసి తన ఎముకలతో ఆయుధాన్ని తయారు చేసుకొమ్మని చెబుతాడు. దేవతలు దధీచి ఎముకలతో దివ్య శిల్పి త్వప్త్రి వజ్రాయుధం తయారు చేసి ఇంద్రుడికి ఇస్తాడు. అయితే కాలకేయులు దేవతలతో భయంకరమైన యుద్ధం చేస్తారు. ఆ సమయంలో వజ్రాయుధం విసరగా అది వృత్రుని చంపేస్తుంది.
తమ నాయకుడి మరణంతో ఆ రాక్షసులు పారిపోయి సముద్రం క్రింద తలదాచుకుంటారు. ఆ విధంగా పగటి పూట సముద్రం క్రింద ఉండి రాత్రి పూట మునులను, ఋషులను మ్రింగడానికి బయటకు వచ్చేవారు. ఆ విధంగా ఆ అసురులు వసిష్ఠుని ఆశ్రమంలోని బ్రహ్మచారులపై,చ్యవన మహర్షి ఆశ్రమంలోని ఋషులను, భరద్వాజ మహర్షి ఆశ్రమంలోని ఋషులను చంపి భయోత్పాతం సృష్టించారు. వీరి వల్ల మొత్తం విశ్వమే భయభ్రాంతులకు గురి అయ్యింది.
 మళ్ళీ దేవతలందరూ నారాయణుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు.అప్పుడు ఆ హరి ఆ దుష్ట కాలకేయులు వరుణుడి నివాసమైన సముద్రం క్రింద ఆశ్రయం పొందారని వారు నాశనం కావాలంటే సముద్రం ఎండిపోవాలనీ, వరుణుడి కుమారుడైన అగస్త్య మహర్షి మాత్రమే సముద్రపు నీటిని పూర్తిగా తాగి,వారి దాగుడు మూతలను వెల్లడించగలడని చెబుతాడు.
 వెంటనే బ్రహ్మతో కలిసి అగస్త్యుని వద్దకు వెళ్లి సముద్రాన్ని తాగమని వేడుకుంటారు. అలాగే నని తాగడం ప్రారంభిస్తాడు. మొత్తం తాగేసరికి సముద్ర గర్భంలో రాక్షసులు ఉన్న విషయం తెలుస్తుంది. అలా రాక్షసుల ఉనికి తెలుసుకుని వారిపై దాడి చేస్తారు. కొందరు చనిపోతారు. మరి కొందరు భూమిని చీల్చి పాతాళానికి పోతారు ‌. ఇదీ విషయం అన్నమాట.
అగస్త్య మహర్షి నేటికీ జీవించే ఉన్నాడని నమ్ముతారు. అందరి ఋషులకు వలె అగస్త్యుడు తల్లిదండ్రులకు పుట్టలేదని వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తూ ఉండగా ఊర్వశి ప్రత్యక్షం అవుతుంది.ఆమెను చూసి   మోహం పొందడంతో వారి వీర్యాలు కుండలో పడ్డాయని.ఆ కుండ గర్భ స్రావం కాబట్టి అందులోంచి అగస్త్యుడు మరియు వసిష్ఠుడు జన్మించారనే కథ ప్రచారంలో ఉంది.
అందుకే "నది మూలం - ఋషి మూలం అడగకూడదు" అని అంటారు.
పై విధంగా ఋషుల పుట్టుక ఎలా ఉన్నా వారి తపస్సు శక్తి, సద్గుణముల ద్వారా మాత్రమే వారి గొప్పతనం తెలుసుకోవాలి.
అలాగే నదులు ఎక్కడో ప్రకృతిలో పుడుతూ ఉంటాయి. ఎక్కడో ఇరుకు లోయల్లోనో, పర్వతాలలోనో  పుడుతూ ఉంటాయి.కానీ అవి ప్రవహించినంత మేర సస్యశ్యామలం చేస్తూ ఉంటాయి.
 పుట్టుక ఎక్కువ, తక్కువ అన్నది కాదు వాళ్ళలోని ప్రతిభా, పాటవాలు, గొప్ప శక్తులు ఇవి ముఖ్యం. మన భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారు అతి ‌సామాన్య కుటుంబంలో పుట్టారు.మరణించేంత వరకు సామాన్య జీవితం గడిపారు. కానీ వారు దేశానికి రాష్ట్రపతి మాత్రమే కాదు . అతడిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు.అంత రిక్ష క్షిపణి మిస్సైల్ తయారీలో కీలక పాత్ర పోషించారు.
 మనం తన సామాన్య జీవితానికి కాదు కదా ప్రాముఖ్యత ఇచ్చేది. ఒక రాష్ట్రపతిగానే కాకుండా చేసిన కృషి, గొప్ప పనులను మనం  పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు.
 కాబట్టి మనం ఈ "క్రియా సిద్ధి స్సత్త్వేభవతి మహతాం నోపకరణే న్యాయము "ద్వారా తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే వ్యక్తి పుట్టుకకు ఎక్కువ, తక్కువ, జాతి,మతం కులం,  రంగులు పులమకూడదు.  వ్యక్తిలోని మంచి గుణాలు, ప్రతిభా పాటవాలు, వారి ఔన్నత్యం, గొప్ప తనం  మొదలైనవి మాత్రమే  పరిగణనలోకి తీసుకోవాలనేది తెలుసుకోవాలి. ఇదే ఈ న్యాయము లోని అంతరార్థము.

కామెంట్‌లు