కవుల ధోరణలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందాలు చూపించి
ఆశలు రేకెత్తించి
ఆనందపరచేవారు కొందరు

తేనెపలుకులు చల్లి
తియ్యదనాలు అందించి
తృప్తిపరచేవారు కొందరు

అక్షరకుసుమాల కూర్చి
పదహారాలను అల్లి
అంతరంగాలనుతట్టేవారు కొందరు

ఆటలు ఆడించి
పాటలు పాడించి
పరవశపరచేవారు కొందరు

కట్టుకథలు చెప్పి
ఊహలలోకానికి తీసుకెళ్ళి
ఉర్రూతలూగించేవారు కొందరు

పరులహితము కోరి
ప్రబోధగీతాలు వ్రాసి
ప్రవచనాలుచెప్పేవారు కొందరు

ప్రేమానురాగాలు పెంచి
ప్రణయగీతికలు పంపి
పులకరింపజేసేవారు కొందరు

వెన్నెల వెదజల్లి
పూదోటలలో విహరింపజేసి
వేడుకపరచేవారు కొందరు


కామెంట్‌లు