అమ్మ!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.
చెత్తలోంచి దుమ్ములోంచి 
మట్టిలోంచి పుట్టుకొచ్చి 
మనిషికి జంతువుకు కాయను పండును 
ఆకును ఇచ్చి ఆకలి తీర్చి 

చివరికి నీడను నిప్పును కప్పును 
సర్వస్వం ఇచ్చి 
చచ్చిపోయిన మహావృక్షం -ఆమె.
ఆమె -అమ్మ!!

స్వాతి చినుకుతో 
మహాసముద్రంలోతుల్లో మునిగి 
మంచి ముత్యాన్ని కన్నా అనంతగర్భం దానిది.

చిప్పే
ఆల్చిప్పే ఆత్మ త్యాగం చేసిన 
ఒక మహా సముద్ర గర్భం అది 
అది -అమ్మ!!

గగన తలం గర్వం అనిచి 
మంచు పర్వతం తలవంచి 
దేశ దేశానికో ప్రేమ సందేశం పంచిన 
మేఘసందేశం అది 
అది ఒక మహానది. అదే- అమ్మ!!

ముసలిది 
కానీ అది సింహం- ముసలి సింహం!!

తన గొయ్యి తానే తవ్వుకొని 
ఎవరి సహాయం కోరకా 
తన చావు తానే చచ్చి -మరణించే 
మహారాణి ఆమె-ఆమె అమ్మ!!!

అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకునీ
(మే రెండో ఆదివారం).

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు