కాలానికి తెలుసో…!? లేదో…!? గానీ…
నాకు మాత్రం తెలుసు
నాలో రాజుకున్న ఈ బడబాగ్ని…
ఏదో ఒకనాడు భళ్ళున పగిలిన
అగ్నిపర్వతం నుండి వెలువడి
ప్రపంచాన్ని ముంచెత్తే లావాలా…
జీవకోటిని భారమనుకోక భరించే నాపై
విచ్చుకత్తులు దూసి ముక్కలు చేసి
విలయతాండవమాడే స్వార్థాన్ని
మట్టుపెట్టి తీరుతుందని..!
ఆశల రెక్కలకు కట్టిన ఆశయాల తోరణాలు
అల్లంత దూరాన అంతరిక్షంలోకి
తారాజువ్వలా దూసుకుపోతుంటే…
ఆశనిపాతంలా అడ్డుకుని
నేల రాల్చాలని విఫలయత్నం చేసే
అతి తెలివి తేటల అత్యాశ గతి
ఒయాసిస్సులో ఊరని నీటి చెలమ
చెంత నిలిచి నిండాలని కాంక్షిస్తూ
వాన నీటి చుక్కకై పరితపించే…
చాతకపక్షిలా నిరీక్షించటమే…!
కూసింత కళ్ళు తెరిచి కాంచక తప్పదు
బావురుమనబోతున్న భవితని భూతద్దంలో…!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి